Crop Damage: ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం
ABN , Publish Date - Oct 21 , 2024 | 04:52 AM
అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.
నిర్మల్ జిల్లాలో తడిసిన సోయా, మక్కలు
ఖమ్మం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు వాన
సాగర్ 20 గేట్లు, శ్రీశైలం 6 గేట్ల ఎత్తివేత
ఇరు ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్కుల వరద
రేపు బంగాళాఖాతంలో వాయుగుండం
ఎల్లుండి తుపానుగా మారే అవకాశం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ముథోల్ మండలంతో పాటు చించాల, ఆష్ట, బోరిగాం, ఎడ్‌బిడ్, వెంకటాపూర్, తరోడా, భైంసా మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన సోయా, మొక్కజొన్న, వడ్లు తడిసిపోయాయి. కోతకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. మధిరలో అత్యధికంగా 2.98సెం.మీ.. పెనుబల్లి, కల్లూరు, చింతకాని మండలం నాగులవంచ, ఎర్రుపాలెం, బోనకల్ మండలం రావినూతల, పెనుబల్లి మండలం గౌరారంలో 1 సెం.మీ.పైగా వర్షం కురిసింది. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో పొలంలో పిడుగుపాటుకు రైతు మడుపల్లి నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది మంగళవారం నాటికి వాయుగుండంగా, బుధవారం తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నిండు కుండలా సాగర్, శ్రీశైలం..
కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. శ్రీశైలానికి ఆదివారం 1.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 6 గేట్లను ఎత్తి 1.67 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 66వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211 టీఎంసీల నీరుంది. జూరాల ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 23 గేట్లు ఎత్తి 94,553 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,814 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌కు 2,28,175క్యూసెక్కుల వరద వస్తోంది. 20 గేట్ల ద్వారా 2,02,404 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 2,45,943 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310 టీఎంసీల నీరు ఉంది.