Share News

Health Cards: రేషన్‌ కార్డుల కోసం గాంధీభవన్‌కు రావద్దు

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:47 AM

రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Health Cards: రేషన్‌ కార్డుల కోసం గాంధీభవన్‌కు రావద్దు

  • గ్రామాల్లోనే సమావేశాలు పెడతాం

  • ‘మంత్రితో ముఖాముఖి’లో ఉత్తమ్‌

  • రెండో రోజూ వినతుల వెల్లువ

  • 320 అర్జీలు స్వీకరించిన మంత్రి

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. వీటి మంజూరుకు సంబంధించి త్వరలోనే గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఆ సమావేశాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న ‘మంత్రితో ముఖాముఖి’లో శుక్రవారం రెండోరోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ సమస్యలపై కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి 320 వరకూ అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫోన్‌ చేసి పరిష్కరించాల్సిందిగా సూచించారు.


కాగా, మంత్రినే నేరుగా కలిసి తమ సమస్య చెప్పుకొనే అవకాశం ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు వచ్చారు. వీరిలో ఇల్లు, రేషన్‌కార్డు కోసం వచ్చినవారే ఎక్కువ మంది ఉన్నారు. వీరితోపాటు భూసమస్యలపై, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో 317 సమస్యపై, సహారా ఇండియాలో ముదుపరులు తమ సమస్యలపైన పలువురు వినతిపత్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో మల్లన్నసాగర్‌ ముంపు బాధితులు వచ్చి తమకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని మంత్రిని కోరారు. పలువురు దివ్యాంగులు తమకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా నమోదు చేసుకున్న గాంధీభవన్‌ సిబ్బంది.. వాటిని టీపీసీసీ చీఫ్‌ లెటర్‌తోపాటు సంబంధిత శాఖలకు పంపించారు. కార్యక్రమంలోటీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 03:47 AM