Share News

Uttam Kumar Reddy: 2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి..

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:26 AM

దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తిచేసి 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని, నాడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సోనియాగాంధీ

Uttam Kumar Reddy: 2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి..

  • సోనియా ఆధ్వర్యంలోనే ప్రారంభం.. ఇక 300 రోజులు పంపింగ్‌.. 60 టీఎంసీలను ఎత్తిపోస్తాం: మంత్రి ఉత్తమ్‌

  • వివిధ కారణాలతో రుణమాఫీలో రూ.13వేల కోట్లు పెండింగ్‌

  • 40 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు..

  • ధరణిని ప్రక్షాళన చేస్తాం: పొంగులేటి

ములుగు/యాదాద్రి, ఆగస్టు 30: దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తిచేసి 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని, నాడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సోనియాగాంధీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత సర్కారు రూ.లక్ష కోట్లు ఖర్చుచేసిందని.. ప్రస్తుతం మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.


కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు, పాలమూరు-రంగారెడ్డికి రూ.25వేల కోట్లు, ఎస్సారెస్పీకి రూ.8వేల కోట్లు.. ఇతర అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.1.8 లక్షల కోట్లు ఖర్చుచేసినా అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. శుక్రవారం ఆయన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీలను సందర్శించి.. సమీక్ష నిర్వహించడంతో పాటు యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆ లోక్‌సభ నియోజకవర్గం స్థాయి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమీక్ష నిర్వహించారు. దేవాదుల, భువనగిరి కార్యక్రమాల్లో ఉత్తమ్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. దేవాదుల కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కోసం అవసరమైన రూ.17,500కోట్ల నిధుల మంజూరు కోసం త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, దేవాదులతోపాటు సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కాలపరిమితిని నిర్దేశించుకుంటామని వెల్లడించారు. 71మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటేనే ఏడాదిలో 170 రోజులపాటు 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టును డిజైన్‌ చేశారని, కానీ, దిగువన నిర్మించిన సమ్మక్క బ్యారేజీ వద్ద నీటికి అడ్డుకట్ట వేయడం ద్వారా ఇకనుంచి దేవాదుల ద్వారా 300రోజులు పంపింగ్‌ చేస్తామని.. ఫలితంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు భువనగిరి, కరీంనగర్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రైతులకు సాగునీటిని అందిస్తామని చెప్పారు.


దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని పొంగులేటి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీకి రూ.18వేల కోట్లు విడుదల చేశామని.. వివిధ కారణాలతో రూ.13వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 40 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామన్నారు. ధరణిని ప్రక్షాళన చేసి, కొత్తగా వచ్చే ఆర్‌వోఆర్‌ రోల్‌ మోడల్‌ అవుతుందని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద భూములను త్యాగం చేసిన ములుగు జిల్లా రైతాంగానికి మాత్రం గోదావరి జలాలు అందడం లేదని, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలలో లిఫ్టులను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క కోరారు.


  • పోలీసులపై నకిరేకల్‌ ఎమ్మెల్యే ఆగ్రహం

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరిలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా? అంటూ ఆయన మండిపడ్డారు.


  • ఉత్తమ్‌ సీఎం అవుతారు: రాజగోపాల్‌

భువనగిరిలో జరిగిన సమీక్ష సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. ఆ వెంటనే సవరించుకుని మంత్రిగారు అన్నారు. అయితే భవిష్యత్తులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం అవుతారని, ఇప్పటికే సీఎం పదవి మిస్‌ అయ్యిందని, తన వ్యాఖ్యలు నిజమవుతాయని చెప్పారు.

Updated Date - Aug 31 , 2024 | 04:26 AM