Vanasthalipuram : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీపై అత్యాచారం
ABN , Publish Date - Jul 31 , 2024 | 04:29 AM
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది.
యువతిపై బాల్యస్నేహితుడి అఘాయిత్యం
మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారం
ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం
ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు
వనస్థలిపురం, జూలై 30(ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా.. పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే.. సరే అని అనడమే ఆమె చేసిన తప్పయింది. కీచకుడిగా మారిన ఆ బాల్య స్నేహితుడు.. తనని నమ్మి వచ్చిన స్నేహితురాలితో బలవంతంగా మద్యం తాగించి ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై, తన స్నేహితుడిని పిలిపించి మరీ అత్యాచారం చేయించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి(24)కి ఓ ఐటీ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆమెతో కలిసి చదువుకున్న హయాత్‌నగర్‌కు చెందిన ఎడ్ల గౌతమ్ రెడ్డి(24) ఈ విషయం తెలిసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పి పార్టీ అడిగాడు. ఇందుకు ఆ యువతి అంగీకరించగా.. సోమవారం రాత్రి ఇరువురు కలిసి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ గౌతమ్ రెడ్డి బలవంతంగా మద్యం తాగించగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దీంతో ఆ రెస్టారెంట్ భవనంలో ఉన్న హోటల్‌లో గది అద్దెకు తీసుకున్న గౌతమ్ రెడ్డి ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడు, చౌటుప్పల్‌కు చెందిన మునగాల శివాజి రెడ్డి అలియాస్ చింటు రెడ్డి(30)కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు.
ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లగా చింటు రెడ్డి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సృృహలోకి వచ్చిన బాధిత యువతి కేకలు వేయడంతో గౌతమ్ రెడ్డి, చింటు రెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధితురాలు మరో స్నేహితుడికి ఫోన్ చేసి సాయం కోరింది.
ఘటనా స్థలికి చేరుకున్న ఆ స్నేహితుడు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి, ఆమె సోదరునికి సమాచారం ఇచ్చాడు. బాధిత యువతి సోదరుడు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గౌతమ్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న చింటురెడ్డి కోసం గాలిస్తున్నారు. బీబీఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న గౌతమ్ రెడ్డి త్వరలో విదేశాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నాడు.