Share News

Vegetable Prices: పండుగ పూట.. కూరల మంట!

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:07 AM

రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

Vegetable Prices: పండుగ పూట.. కూరల మంట!

  • మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు

  • వారంలోనే 30శాతం పెరిగిన వైనం

  • రైతుబజార్లలో టమాటా కిలో రూ.63

  • బెండకాయ, క్యారట్‌.. కేజీకి రూ.40పైనే

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం.. పది రోజుల్లోనే సరాసరిన 30శాతం పైగా రేట్లు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రధానంగా ఉల్లిగడ్డ, టమాట ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని రైతు బజార్లు, హోల్‌సేల్‌ మార్కెట్లలోనే గరిష్ఠ ధరలు ఉండగా.. రిటైల్‌ దుకాణాలు, రోడ్లపైన బండ్లపై విక్రయించే వాళ్లు మరో 30శాతం అదనంగా విక్రయిస్తున్నారు.


సాధారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లు, రైతుబజార్లకు శివారు ప్రాంతాలైన యాచారాం, మంచాల, మహేశ్వరం, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం నుంచి టమాటాలు, పచ్చి మిర్చి, దొండకాయ, బెండకాయ, వివిధ రకాల ఆకుకూరలు వస్తుంటాయి. ఏపీలోని మదనపల్లి నుంచి టమాట, మహారాష్ట్రలోని నాసిక్‌, సోలాపూర్‌తోపాటు కర్నూల్‌ జిల్లా నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వస్తుంది. అయితే, గత నెలలో కురిసిన వర్షాలకు చాలా చోట్ల పంటలు దెబ్బతినడంతో.. కూరగాయల దిగుమతి బాగా తగ్గింది. పండుగల నేపథ్యంలో డిమాండ్‌ అధికంగా ఉండడంతో వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు.


కొద్ది నెలలుగా టమాట రేట్లు తగ్గుతూ, పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం కిలో రూ.120 పలికిన రేటు.. ఆ తర్వాత 15 రోజులకు తగ్గింది. ఆ సమయంలో కిలో రూ.25 నుంచి 30 మధ్య, రోడ్ల వెంట ట్రాలీ ఆటోల్లో రూ.100కు 6కిలోల దాకా అమ్మారు. అదే టమాట.. ప్రస్తుతం రైతుబజార్‌లో కిలో రూ.63 పలుకుతుండగా.. కాలనీల్లోని దుకాణాల్లో రూ.80, సూపర్‌ మార్కెట్‌లో రూ.110 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ సైతం అదే తీరులో చుక్కలు చూపిస్తోంది. నెల రోజుల క్రితం వరకూ కిలో రూ.25వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.50పైనే పలుకుతోంది. ఒక వైపు వంటనూనెలు, పప్పుల రేట్లు హడలెత్తిస్తుండగా.. కూరగాయల ధరలూ పెరగడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 04:07 AM