VIT University: వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల జాబితా విడుదల
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:38 AM
అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు, విలువలు, ప్రతిభాపాటవాలతో కూడిన విద్యనందించటంలో సుస్థిరత్వాన్ని కలిగిన విశ్వవిద్యాలయాలలో వేలూరులోని వీఐటీ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ సంపాదించుకుంది.
జాతీయ స్థాయిలో వీఐటీకి 8వ ర్యాంక్
చెన్నై, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు, విలువలు, ప్రతిభాపాటవాలతో కూడిన విద్యనందించటంలో సుస్థిరత్వాన్ని కలిగిన విశ్వవిద్యాలయాలలో వేలూరులోని వీఐటీ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ సంపాదించుకుంది. ఇటీవల ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్: సస్టయినబిలిటీ 2025’ పేరిట థర్డ్ ఎడిషన్ క్యూఎస్ (నాణ్యతా ప్రమాణాల) జాబితాను విడుదల చేసింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1744 విద్యాసంస్థలకు గాను వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) 396వ ర్యాంక్ సంపాదించుకుంది.
ఆ జాబితా ప్రకారం భారతదేశంలో ఈ యేడాది ఉత్తమ విద్యాసంస్థలుగా ఎంపికైన 78 విద్యాసంస్థలలో వీఐటీ 8వ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాపంగా వీఐటీ ర్యాంక్ 53 స్థానాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఐక్యరాజ్య సమితి సూచించిన 17 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీలు) సాధన దిశగా పురోగమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అలాంటి లక్ష్యాల దిశగా పయనిస్తున్న 400 విశ్వవిద్యాలయాలలో వీఐటీ విశ్వవిద్యాలయం కూడా ఒకటి. ఈ క్యూఎస్ సస్టయినబిలిటీ ర్యాంకింగ్ పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావం, నిర్వహణ అనే మూడు ప్రధాన పరిమితులపై ఆధారపడి ఉంటుంది.