Share News

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. పోలింగ్ రోజు ఈ తప్పు అస్సలు చేయకండి..

ABN , Publish Date - May 11 , 2024 | 06:48 PM

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది. రోడ్ షోలు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ క్లోజ్ అయ్యాయి. బల్క్ ఎస్ఎంఎస్ లపై ఈసీ(Election Commission of India) నిఘా పెట్టింది.

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. పోలింగ్ రోజు ఈ తప్పు అస్సలు చేయకండి..
Lok Sabha Elections 2024

హైదరాబాద్, మే 11: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది. రోడ్ షోలు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ క్లోజ్ అయ్యాయి. బల్క్ ఎస్ఎంఎస్ లపై ఈసీ(Election Commission of India) నిఘా పెట్టింది. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో శని, ఆదివారాల్లో మరింత ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఎన్నికల అధికారులు.


ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్..

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీ ఎత్తున భద్రతాదళాలను మోహరింపజేశారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.


60 రోజులు కొనసాగిన ప్రచారం..

మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు 60 రోజుల తర్వాత ముగిసింది. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు సాయంత్రం 6.00 గంటల వరకు పొడిగించింది. నాలుగో విడతలో భాగంగా జరుగుతున్న ఈ పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఓటర్లు ఈ తప్పు చేయొద్దు..

పోలింగ్ సమయంలో ఓటర్లు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున.. ఐదుగురికి మించి రోడ్డుపైకి రాకూడదు. మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలు అనుమతించ బడవు. వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం. అంతకంటే ముఖ్యంగా కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలో మీటరు దూరం వరకు తీసుకెళ్లకూడదు. ఆత్మ రక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడం నిషేధం. మద్యం, మద్యం దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని దుకాణాలను మూసి వేయాలి.


రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 1,09,941 బ్యాలెట్‌ యూనిట్లు, 50,135 వీవీ ప్యాట్‌లు, 44,906 కంట్రోల్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు అధికారులు. 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్‌ ముగిసింది. హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతో పాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ (ఈడీసీ) ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్‌ రోజున ఓటు వేయనున్నారు. 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

For More Telangana News and Telugu News..

Updated Date - May 11 , 2024 | 06:48 PM