Share News

Hyderabad: ఖైదీల ‘క్షమాభిక్ష’కు ఓకే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:05 AM

రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతూ.. సత్ప్రవర్తన కలిగిన, అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. క్షమాభిక్షపై ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు.

Hyderabad: ఖైదీల ‘క్షమాభిక్ష’కు ఓకే..

  • విడుదలకు గవర్నర్‌ ఆమోదముద్ర

  • వారికి ఉపాధి చూపాలని సూచన

  • ‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల’పైనా చర్చ

  • పన్ను చెల్లింపుదారుల

  • సీఎం రేవంత్‌కు సూచించిన గవర్నర్‌

  • రేపు చర్లపల్లిలో జాబ్‌ మేళా

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతూ.. సత్ప్రవర్తన కలిగిన, అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. క్షమాభిక్షపై ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. గత జనవరి 26న జైళ్ల శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో ఉన్న వారిలో 231 మంది క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలు ఉన్నారు. అందులో గత ఐదు నెలల్లో 20 మంది విడుదలయ్యారు. మిగిలిన 210 మంది ఈ వారంలో విడుదల కానున్నారు. వాస్తవానికి గవర్నర్‌తో సీఎం రేవంత్‌ భేటీ అనంతరం ఖైదీల విడుదలపై సోమవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కానీ, క్షమాభిక్షపై జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్‌ రాధాకృష్ణన్‌ సీఎంకు సూచించారు.


దీంతో క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు ఉపాధి అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ సాయంత్రం 4 గంటలకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో క్షమాభిక్షకు ఎంపికైన ఖైదీలందరినీ బుధవారం చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. వారికి జాబ్‌ మేళా నిర్వహించి ఆసక్తి, అర్హత మేరకు వారు ఎక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారనేది అధికారులు తెలుసుకోనున్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్‌ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఉపాధి అవకాశం కల్పిస్తారు. అవసరమైన వారికి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి చూపించనున్నారు. జాబ్‌మేళా పూర్తయిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఖైదీల విడుదలపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 03:05 AM