Share News

Lok Sabha Elections 2024: మారిన సమీకరణలు.. కోట ఎవరిదో?

ABN , Publish Date - May 01 , 2024 | 04:03 PM

మానుకోటలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

Lok Sabha Elections 2024: మారిన సమీకరణలు.. కోట ఎవరిదో?

  • మారిన సమీకరణాలు

  • ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌ వారే

  • సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌

  • హ్యాట్రిక్‌ కోసం గులాబీ పార్టీ ప్రయత్నం

  • బోణీ కొట్టేందుకు కమలం కసరత్తు

  • మహబూబాబాద్‌పై ఎవరి ధీమా వారిదే

భద్రాచలం, మే 1 (ఆంధ్రజ్యోతి): మానుకోటలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు మహబూబాబాద్‌ సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా పోరాడుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్‌ దక్కించుకుంది. భద్రాచలంలో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శతవిధాల పోరాడుతుండగా ఒక్కసారి కూడా విజయం సాధించని బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.

జోరు మీదున్న కాంగ్రెస్‌

ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. 2009లో ఆవిర్భవించగా తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పోరిక బలరాం నాయక్‌ 68,795 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆయనకు 2,85,577 ఓట్లు వచ్చినప్పటికీ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మూడోసారి పోటీచేయగా 3,15,446 ఓట్లు పోలైనప్పటికీ ఓడిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తీరాలని ఆ పార్టీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వారే ఉండటం తమకు కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అలాగే అన్ని సెగ్మెంట్ల పరిధిలో వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులతోపాటు బీఆర్‌ఎ్‌సలో ప్రభావం చూపే నాయకులు హస్తం గూటికి చేరేలా చర్యలు చేపట్టారు. ఈ విషయంలో ఇప్పటికే సత్ఫలితాలు సాధించామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బీఆర్‌ఎస్‌ పాలనలో అధికార, నిధుల దుర్వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తే బలరాం విజయం నల్లేరుపై నడకేనని ఆ పార్టీ విశ్వసిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నియోజకవర్గ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుల వ్యూహరచనతోపాటు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

హాట్రిక్‌ కోసం గులాబీ ప్రయత్నం

ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించలని గులాబీ పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి అజ్మీరా సీతారాం నాయక్‌, మాలోతు కవితలు విజయం సాధించారు. ఈ క్రమంలో సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితను మరోసారి బరిలో నిలపడంతో ఎలాగైనా హ్యాట్రిక్‌ నమోదు చేయాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా కృషి చేస్తున్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సీతారాం నాయక్‌ 34,992 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో 1,46,663 ఓట్ల ఆధిక్యంతో మాలోతు కవిత విజేతగా నిలిచారు. మానుకోట పరిధిలోని భద్రాచలం అసెంబ్లీ స్థానంలో మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రె్‌సలో చేరడంతో ఆ పార్టీ నాయకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరడంతో కొన్నిచోట్ల ఇబ్బందులున్నా పార్టీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమ గెలుపునకు బాసటగా నిలుస్తాయని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు.

మోదీ చరిష్మాపైనే నమ్మకం

ఈ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా బీజేపీ విజయం సాధించలేదు. 2019లో కమలం పార్టీ నుంచి జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ బరిలో ఉండగా ఆయనకు 25,487 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు ప్రజలను మోసపూరిత పాలన, వాగ్దానాలతో వంచించాయని, మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, స్వచ్ఛమైన పాలనతో ఇక్కడ గెలిచి బోణీ కొడతామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 01 , 2024 | 04:13 PM