CS Shanti Kumari: స్కిల్ వర్సిటీలో దసరా నుంచి
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:06 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండుగ నుంచి కోర్సులను ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
6 కోర్సులు ప్రారంభం
భాగస్వామ్యం కోసం 140 సంస్థల ఆసక్తి
తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్,
లాజిస్టిక్స్ రిటైల్‌లో సర్టిఫికెట్ కోర్సులు
సీఎస్ శాంతికుమారి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండుగ నుంచి కోర్సులను ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా అందించే కోర్సుల్లో ఇప్పటి వరకు 20 కోర్సులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో ఆరు కోర్సులను దసరా పండుగ నుంచి ప్రాథమికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు.
స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై శనివారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముచ్చర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీ పనులు పూర్తయ్యేవరకు తాత్కాలిక భవనంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలోగానీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్)లోగానీ లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్)లోగానీ నిర్వహిస్తామన్నారు.
దాదాపు 140 కంపెనీలు యూనివర్సిటీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తి చూపుతున్నాయని, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనున్నామని చెప్పారు. వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌బీఐ, ఎన్‌ఏసీ, డా.రెడ్డీస్ ల్యాబ్, అదానీ వంటి సంస్థలు అంగీకరించాయని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) కూడా ముందుకు వచ్చిందన్నారు.