Share News

Suicide Attempt: యువతి ప్రాణాలను కాపాడిన పోలీసుల అప్రమత్తత

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:41 AM

ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని బోయిన్‌పల్లి పోలీసులు అందించిన సమాచారంతో శ్రీశైలం, దోమలపెంట, ఈగలపెంట పోలీసులు కాపాడారు.

Suicide Attempt: యువతి ప్రాణాలను కాపాడిన పోలీసుల అప్రమత్తత

  • ప్రేమలో మోసపోయి ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువతి

  • శ్రీశైలం వద్ద సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ గుర్తింపు

  • బోయిన్‌పల్లి పోలీసుల సమాచారంతో యువతిని కాపాడిన అక్కడి పోలీసులు

బోయిన్‌పల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని బోయిన్‌పల్లి పోలీసులు అందించిన సమాచారంతో శ్రీశైలం, దోమలపెంట, ఈగలపెంట పోలీసులు కాపాడారు. వనపర్తి జిల్లాకు చెందిన యువతి(24) ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో వనపర్తి జిల్లా జెట్రోలుకు చెందిన ఖాదర్‌ పాషా(22) పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువతి వెంట పడిన పాషా.. ఆమెను తన గదికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.


బాధితురాలు పెళ్లి చేసుకోవాలని అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని కులం పేరుతో దూషించాడు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనలతో మనస్తాపం చెందిన యువతి.. ‘‘నేను గర్భవతినని తెలిసి ఖాదర్‌, అతని తండ్రి నన్ను చంపాలని చూశారు. నాకోసం వెతక్కండి’’ అని లేఖ రాసి ఇంటినుంచి వెళ్లిపోయింది.


ఆదివారం అర్ధరాత్రి శ్రీశైలం సమీపంలోని వంతెన వద్ద యువతి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ను గుర్తించిన బోయిన్‌పల్లి పోలీసులు వెంటనే ఈగలపెంట, దోమలపెంట, శ్రీశైలం పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఆత్మహత్యకు యత్నిస్తున్న ఆమెను అక్కడి పోలీసులు కాపాడారు.

Updated Date - Aug 13 , 2024 | 04:41 AM