Yearender 2024: మోదీ కాస్త వెనుకంజ.. రాహుల్ కాస్త ముందంజ
ABN , Publish Date - Dec 28 , 2024 | 07:44 PM
మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం చరిత్రలో 2024కు విశేష స్థానం ఉంది. 64.2 కోట్ల మంది అర్హులైన ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికలను నిర్వహించింది. ఏప్రిల్-జూన్ మధ్యలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్తెసరు మార్కులతో విజయం సాధించగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నైతిక బలాన్ని పుంజుకున్నారు. 99 స్థానాలను గెల్చుకుని లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాకు రాహుల్ ఎదిగారు. ఈ విజయానికి, మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు. 2019లో కన్నా 2024లో రెట్టింపు స్థానాలు రావడం వెనుక రాహుల్ పాత్ర, శ్రమ ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. మోదీని ఢీకొట్టగలిగే నేతగా ఆయన పరిణతి సాధించారని సంతోషిస్తున్నారు.
Yearender 2024: మంచి మాటలే మోదీ దౌత్య సాధనాలు
మరోవైపు మోదీ అనుకున్నంతగా విజయం సాధించకపోయినా, ఎన్డీయేను గట్టెక్కించగలిగారు. బీజేపీకి దాదాపు 240 స్థానాలే వచ్చినా, ఎన్డీయేలోని మిగిలిన పార్టీల మద్దతుతో అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలిగింది. దీంతో ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తగినంత సంఖ్యాబలం లేనందువల్లే వక్ఫ్ సవరణ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లు వంటివాటిలో మోదీ ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రోజున మొదట్లో గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా మోదీ వెనుకంజలో ఉండేవారు. 2019లో మోదీకి 4.5 లక్షల ఓట్ల మెజారిగటీ లభించగా, 2024లో ఆయనకు 1.52 లక్షల ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న నేతకు ఇంత తక్కువ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి.
విజయోత్సవ సభలో మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అన్ని రాష్ట్రాలతోనూ కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటానన్నారు.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News