Share News

Police : సింహం గ‌డ్డిమేస్తే..!

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:35 AM

నెల మామూళ్లు ఇస్తే చాలు.. బియ్యాన్ని అక్రమంగా తరలించుకోవచ్చు. మద్యం దుకాణదారులు నిబంధనలను గాలికి వదిలేయొచ్చు. పేకాట స్థావరాలు పెట్టుకుని.. ఎన్ని ముక్కలాటలైనా ఆడుకోవచ్చు. దొంగతనాలు, ఆత్మహత్యలు, గొడవలు.. ఇలా ఏ నేరం జరిగినా పంచాయితీ పెడతారు. కేసు కట్టకుండా సెటిల్మెంట్‌ చేసి పంపుతారు. కాసులు రాలవని తెలిస్తే.. ఆ కేసుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఛేదించని దొంగతనం కేసులూ ఈ ...

Police : సింహం గ‌డ్డిమేస్తే..!

  • పోలీస్‌ స్టేషన్లలో పంచాయితీలు

  • వసూళ్లలో కొందరు పోలీసులు బిజీ

  • రేషన బియ్యం దందా, మద్యం, పేకాటకు అండ

  • గాడితప్పిన కొందరు సీఐలు.. ఎస్‌ఐలు.. సిబ్బంది

సింహం గడ్డిమేస్తే..

నెల మామూళ్లు ఇస్తే చాలు.. బియ్యాన్ని అక్రమంగా తరలించుకోవచ్చు. మద్యం దుకాణదారులు నిబంధనలను గాలికి వదిలేయొచ్చు. పేకాట స్థావరాలు పెట్టుకుని.. ఎన్ని ముక్కలాటలైనా ఆడుకోవచ్చు. దొంగతనాలు, ఆత్మహత్యలు, గొడవలు.. ఇలా ఏ నేరం జరిగినా పంచాయితీ పెడతారు. కేసు కట్టకుండా సెటిల్మెంట్‌ చేసి పంపుతారు. కాసులు రాలవని తెలిస్తే.. ఆ కేసుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఛేదించని దొంగతనం కేసులూ ఈ జాబితాలో ఉన్నాయి..! కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలే..! కానీ కొన్ని స్టేషన్లలో నాలుగో సింహం అవినీతికి ప్రతిరూపంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అలాంటి స్టేషనలలో కొన్నింటి గురించి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం క్రైం

జీతాలు చాల్లేదు మరి..!

జిల్లాలో కొందరు సీఐలు, ఎస్‌ఐలకు జీతం చాలడం లేదేమో..! అందుకే పంచాయితీలు చేస్తున్నారు. స్టేషనకు వచ్చేవారిని బాధితులుగా కాకుండా.. కస్టమర్లుగా చూస్తున్నారు. కాసులు రాలేలా ఉంటేనే పలకరిస్తున్నారు. లేదంటే


ఏదో ఒకటి చెప్పి పంపుతున్నారు. ఫలితంగా ప్రతి సోమవారం డీపీఓలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 130 నుంచి 140 ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొన్ని ఫిర్యాదులు రెండు, మూడుసార్లు వచ్చినవీ ఉంటున్నాయి. నార్పలకు చెందిన ఓ మహిళ దొంగతనంపై నాలుగోసారి ఎస్పీని కలిశారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఉన్నతాధికారులు స్థానిక పోలీస్‌ స్టేషనలకు రెఫర్‌ చేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా, బాధితులు జిల్లా కేంద్రం వరకూ రావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ఆలోచిస్తే.. సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారమౌతాయి.

ఇసుక.. మందు.. పేకాట

అనంతపురం-తాడిపత్రి రహదారి మధ్యలో వచ్చే నియోజకవర్గ కేంద్రంలో పని చేస్తున్న ఓ ఇనస్పెక్టర్‌ బాగా మేస్తున్నారు. స్టేషన పరిధిలోని మూడు వైన షాపుల నుంచి నెలకు రూ.50 వేలు అందుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఇసుక బాగా దొరుకుతుంది. అది కూడా ఆయనకు ఆదాయం తెచ్చిపెడుతోంది. జిల్లా కేంద్రానికి, ఇతరప్రాంతాలకు ఇసుకను తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లు ఒప్పందం చేసుకుని మరీ డబ్బులు పంపిస్తారట. అక్కడ ఓ కీలక ప్రజాప్రతినిధి చెప్పిన ప్రతి పనీ ఆయన చేసిపెడతారట. ఆ సర్కిల్‌ పరిధిలో మరో ముఖ్య ఆదాయం పేకాట. చూసీ చూనట్లు ఉండేందుకు పేకాట నిర్వాహకులు నెల నెలా పంపే మొత్తం రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం. అక్కడే పనిచేస్తున్న ఓ కిందిస్థాయి అధికారి చిన్న చిన్న మొత్తాలకూ కక్కుర్తి పడతారట. హైవేలో వెళ్తున్న వాహనాలను సైతం ఆయన వదలరని సమాచారం. ఈయన నియోజకవర్గ కేంద్రంలో ఉండకుండా, పక్క మండలంలో ఎక్కువగా పంచాయితీలు చేస్తుంటారని ప్రచారం ఉంది.

ఎవరూ తగ్గరు..

  • అనంతపురం సబ్‌ డివిజన పరిధిలో అక్రమ ఆదాయం కోసం కొందరు పోటీ పడుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ పోలీ్‌సస్టేషనలో అధికారి ఇదివరకు ఇసుక విషయంలో బాగా సొమ్ము చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పంచాయితీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. సొమ్ము చేసుకోవడంలో బిజీగా ఉన్నారట.

  • ఆలమూరు సమీపంలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో చౌకధరల దుకాణం బియ్యం సరఫరా చేస్తుంటాడు. ఇతని నుంచి ప్రతి నెలా పోలీసులకు నెల మామూళ్లు వెళ్తుంటాయని సమాచారం. సంబంధిత పోలీ్‌సస్టేషనలో పనిచేసే ఓ అధికారి బాగానే పంచాయితీలు చేస్తూ ముడుపులు పుచ్చుకుంటారు. గతంలోనూ అక్కడే పనిచేయడంతో ఈయనకు పరిచయాలు బాగానే ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య కేసును పంచాయితీ చేసి రూ.3 లక్షలు తీసుకున్నారు. ఈ సొమ్ములో స్టేషన సిబ్బందికి వాటా కింద ‘బిర్యానీ’ తినిపించినట్లు సమాచారం.

  • యూనివర్సిటీలకు సమీపంలో ఉండే ఓ పోలీ్‌సస్టేషనకు ఇసుక అక్రమ రవాణా ఆదాయం బాగా అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. ఓ సీఐ హయాంలో ఆయన భూ వ్యవహారాల్లో బాగా జోక్యం చేసుకునేవారని, పంచాయితీలు, వసూళ్లలో కీలకంగా పనిచేశాడని సమాచారం.

మీకు మేము.. మాకు మీరు..

కళ్యాణదుర్గం పరిధిలో పేకాట, మట్కాకు అడ్డే లేదు. నిర్వాహకులు పోలీసులకు భారీగా ముడుపులు పంపతున్నారని సమాచారం. కీలకమైన ఓ సర్కిల్‌లో పనిచేసే అధికారి అవినీతి అంతా ఇంతా కాదని అంటున్నారు. ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు వసూలు చేశారు. మట్కా బీటర్లుగా పేరుగాంచిన ఇద్దరి నుంచి రూ.లక్ష వరకు పిండుకున్నారు. తాజాగా ఓ పంచాయితీ చేసి రూ.3 లక్షలు గుంజారు. సమీపంలోని మరో పోలీస్‌ స్టేషనలో సీఐ సర్‌కు ఓ కానిస్టేబుల్‌ నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నాడు. మట్కా, పేకాట సహా అన్ని అసాంఘిక వ్యవహారాలు ఆ కానిస్టేబుల్‌ కనుసన్నల్లోనే జరుగుతుంటాయట. ఓ పోలీ్‌సస్టేషన పక్కనే రేషన బియ్యం అక్రమంగా తరలించే మహిళ ఉంటారు. ‘మీకు మేము.. మాకు మీరు’ అన్నట్లుగా ఆమె దందాకు సహకరిస్తూ.. భారీగా ముడుపులు అందుకుంటున్నారని ప్రచారం ఉంది. పోలీసుల పుణ్యమా అని ఆమె రూ.కోటి వ్యయంతో భవనం నిర్మిస్తున్నట్లు సమాచారం.

అక్కడ అంతా ఆయనే....

ఉరవకొండ ప్రాంతంలో ఓ ఎస్‌ఐ హవా సాగుతోంది. రేషన బియ్యం అక్రమ వ్యాపారం ఇక్కడి పోలీసుల్లో కొందరికి కాసులు కురిపిస్తోంది. ఉరవకొండ నుంచి పావగడకు రోజూ 300 క్వింటాళ్ల వరకు రేషన బియ్యం తరలిస్తుంటారు. ప్రతి నెలా రూ.లక్షపైగా బేరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ బియ్యం కేసు వ్యవహారం బయటపడితే... పై అధికారులకు అది సోనామసూరి బియ్యం అని చెప్పి, తప్పించారట. ఆ ఎస్‌ఐకి ఓ కానిస్టేబుల్‌ మధ్యవర్తిగా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. విడపనకల్లులోనూ రేషన బియ్యం వ్యాపారం బాగా నడుస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండలంలో వైసీపీ నాయకుడి నేతృత్వంలో పేకాట జోరుగా సాగుతోంది. వైసీపీ నాయకుడికి ముగ్గురు టీడీపీ నాయకులు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. చూసీచూడట్లు ఉండేందుకు నెలకు రూ.లక్ష ఇవ్వాలని ఎస్‌ఐ బేరం పెట్టినట్లు సమాచారం.

ఆ ఇద్దరే కీలకం...

గుంతకల్లు పరిధిలోని ఓ పోలీ్‌సస్టేషనలో సీఐ కమర్షియల్‌ వ్యవహారాలు శృతిమించాయని అంటున్నారు. పంచాయితీలు చేయడం.. ముడుపులు పుచ్చుకోవడం ఆయన అలవాటని అంటున్నారు. ఆ పోలీస్‌ స్టేషనలో అధికార పార్టీ నేతకు బంధువైన హెడ్‌కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ హవా నడిపిస్తున్నారు. ఓ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందితే.. యాజమాన్యం నుంచి రూ.50వేలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

నగరంలోనూ అంతే..

అనంతపురం వనటౌన స్టేషన చాలా కమర్షియల్‌. ప్రస్తుత ఎస్పీ, సీఐ రానంతవరకు మట్కా జోరుగా సాగింది. ఇప్పటికీ కొందరు కానిస్టేబుళ్లు వారితో వ్యవహారం నడుపుతున్నారు. సోఫాల పేరుతో పిలిచే ఓ పెద్దమనిషిని మధ్యవర్తిగా వాడుకునేవారు. అతను పంచాయితీలు తెచ్చి జేబులు నింపుకునేవాడు. కొత్త సీఐ వచ్చాక ఆ ప్రభావం తగ్గినట్లు సమాచారం. ఇప్పటికీ దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ ఏఎ్‌సఐ, మిస్సింగ్‌ కేసులొస్తే వెళ్లే ఓ కానిస్టేబుల్‌, ఏఆర్‌ నుంచి వచ్చిన కానిస్టేబుల్‌, మరో హెడ్‌కానిస్టేబుల్‌ కీలకంగా ఉన్నట్లు సమాచారం. సమీపంలోని స్టేషన నుంచి వచ్చిన ఓ అధికారి చిన్న చిన్న వ్యవహారాల్లో రూ.10 వేలకు తక్కువ కాకుండా పుచ్చుకుంటారని సమాచారం. స్టేషన పరిధిలోని వైనషాపులు (నేతలవి కాకుండా), డాబాల నుంచి నెల మామూళ్లు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అంటున్నారు. త్రీటౌనలో న్యాయవాది శేషాద్రి మృతి చెందక ముందు కొన్ని పంచాయితీల ముసుగులో ముడుపులు పుచ్చుకునే వారు. అక్కడ కీలకంగా ఉండే ఓ కానిస్టేబుల్‌ను బదిలీ చేశారు. ఇప్పుడు అక్కడ ఓ ఏఎ్‌సఐ, మరో హెడ్‌కానిస్టేబుల్‌ చక్రం తిప్పుతున్నారట. నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషనలో తరచూ జరిగే పంచాయితీలతో కొందరు జేబులు నింపుకుంటున్నారట. ఇక అక్కడ డాబాలకు లెక్కేలేదు. హైవే మొత్తం అవే ఉన్నాయి. వాటి నుంచి ప్రతినెలా మామూళ్లు వస్తుంటాయి.

కేసులు వద్దు... కాసులే..!

శింగనమల నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఓ మండల కేంద్రంలో పనిచేస్తున్న ఎస్‌ఐ బాగా సంపాదిస్తున్నారు. నాలుగు వైనషాపుల నుంచి ఆయనకు నెలకు రూ.60వేలు అందుతోందని సమాచారం. ఆ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల భూ వివాదం తలెత్తి, ఇరువర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘటనలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు దెబ్బలు తగిలి కిందపడ్డాడు. మరో వ్యక్తి గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంత జరిగినా కేసు కట్టలేదు. రూ.70 వేలు తీసుకుని సెటిల్‌ చేశారని సమాచారం. తమిళనాడుకు చెందిన డ్రైవర్‌ ఆ ప్రాంతానికొచ్చి అతిగా మద్యం సేవించి గుండెపోటుతో మృతి చెందాడు. గుర్తు తెలియని మృతదేహం అని నమోదు చేసుకుని, పూడ్చిపెట్టారు. కొంతకాలానికి వారి బంధువులు వస్తే, ఆ మృతదేహాన్ని వెలికి తీయించి ఇచ్చేందుకు రూ.30 వేలు పుచ్చుకున్నారు. ఈ మండలంలో కొన్ని తోటలు, గుట్టలు పేకాట స్థావరాలుగా మారిపోయాయి. ఈ శిబిరాల నుంచి నెలకు రూ.లక్ష వరకు ఇస్తారని సమాచారం. ఆ ఎస్‌ఐ బాధ్యతలుచేపట్టాక ఇక్కడ ఒక్క దొంగతనం కేసునూ ఛేదించలేదు. ఆయన ఎక్కువగా అనంతపురంలోనేఉంటారని సమాచారం.

పోటాపోటీ

తాడిపత్రి నియోజకవర్గంలోని రెండు మండలాల పేర్లలో తొలి అక్షరాలు ఒకేలా ఉంటాయి. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు పోలీస్‌ అధికారులు అక్రమార్జనలో పోటీ పడుతున్నారని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక వ్యవహారం బాగా నడుస్తోంది. పంచాయితీలు, అసాంఘిక వ్యవహారాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారని అంటున్నారు. తాడిపత్రి పరిధిలో ఓ ఎస్‌ఐ చిన్న చిన్న పంచాయితీల పేరుతో పైసలు వసూలు చేస్తుంటారట. వాటికి సమీపంలోని ఓ పోలీ్‌సస్టేషన పరిధిలోలో పేకాట ముమ్మరంగా సాగుతోంది. సంబంధిత పోలీ్‌సస్టేషనకు నెల మామూళ్లు వెళుతున్నాయని సమాచారం. బాధితులు స్టేషనకు వెళితే.. కేసు కడితే నాకేంటి..? అని అడుగుతారట అక్కడి అధికారి. ఆయన వద్ద పైసలే మాట్లాడతాయని అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2025 | 12:35 AM