‘Andhra Jyothi’ : మీ సమస్యకు మా పరిష్కారం!
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:56 AM
‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ పదునైన కథనాలతో కలమెత్తుతున్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రజా సమస్యలపై ‘అక్షర’ శంఖారావం.. పరిష్కారమే అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’ వినూత్న కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా 24 కేంద్రాల్లో నిర్వహణ
కాలనీలకు తరలి వచ్చిన నేతలు, అధికారులు
సమస్యలు వివరించిన స్థానిక ప్రజలు
వాటి పరిష్కారంపై నిర్దిష్ట హామీలు
కొన్ని అంశాలపై అప్పటికప్పుడే ఆదేశాలు
శ్రీకాకుళంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ పదునైన కథనాలతో కలమెత్తుతున్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మీ సమస్య... మా ద్వారా పరిష్కారం’ అంటూ ప్రజాప్రతినిధులు, కీలక అధికారులకు - ప్రజలకూ మధ్య సంధానకర్తగా నిలిచింది. ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 24 కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్పొరేటర్, మేయర్ల నుంచి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేల వరకు... శానిటరీ ఇన్‌స్పెక్టర్ నుంచి కలెక్టర్ వరకు అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఈ చర్చా వేదికకు హాజరయ్యారు. ఇతర కేంద్రాలకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర అధికారులు తరలి వచ్చారు. కేవలం ఒక శాఖ, ఒక విభాగానికి పరిమితం కాకుండా... రెవెన్యూ, మునిసిపల్, ఆరోగ్య, పోలీసు, రవాణా, విద్యుత్తు, నీటిసరఫరా తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు సంధానకర్తలుగా వ్యవహరించారు. కొన్ని సమస్యలు చిన్నవే! వాటి వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులు మాత్రం పెద్దవి! ఇవి ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే పరిష్కరించగలిగేవి! మరికొన్ని సమస్యలు తీవ్రమైనవి! వాటిని స్థానికులే ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
జనం పెద్దసంఖ్యలో తమ వ్యక్తిగత సమస్యలను కూడా ప్రస్తావించారు. ‘చూద్దాం... చేద్దాం’ అని కాకుండా ఎప్పటిలోగా పరిష్కరిస్తామో అధికారులు, నేతలు నిర్దిష్టంగా అప్పటికప్పుడే ప్రకటించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నగరంలోని 31వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సాయినగర్ కాలనీలో చాకలి చెరువును బాగుచేయకపోవడంవల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు చెప్పడంతో... వెంటనే స్పందించిన రామ్మోహన్.. ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అధికారులను వెంటబెట్టుకుని అప్పటికప్పుడు చెరువును స్వయంగా పరిశీలించారు. చెరువును బాగుచేసి అభివృద్ధి చేయాలని అక్కడే కమిషనర్‌ను ఆదేశించారు. కడప అశోక్‌నగర్ ప్రధాన రహదారితోపాటు మిగిలిన వీధుల్లో ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొనడంతో... సమావేశం ముగిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’పై ప్రభుత్వ యంత్రాంగం స్పందనకు... మచ్చుకు రెండు ఉదాహరణలు ఇవి! ఇలా అన్ని కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్దిష్ట హామీలు లభించాయి. తక్షణ పరిష్కారాలూ కనిపించాయి. అధికారులు, నేతలే తమ కాలనీలకు తరలి వచ్చి ఇబ్బందులు తెలుసుకునేలా చొరవ చూపిన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
అక్కడికక్కడే ఇంటి పట్టా ఇచ్చేశారు
బాధిత మహిళకు అప్పటికప్పుడే
న్యాయం చేసిన చిత్తూరు కమిషనర్
చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : చిత్తూరు నగరం విజయలక్ష్మి కాలనీలో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమం జరిగింది. చిత్తూరు మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్‌వో లోకేశ్, ఏసీపీ నాగేంద్ర, కార్పొరేటర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రధానంగా కింది సమస్యలు ప్రస్తావించారు...
సమస్యలు:-
సంతపేట రోడ్డు పొడవునా మాంసం దుకాణాలను పెట్టారు. వాటిని అక్కడ తొలగించి ఒకేచోట ఏర్పాటు చేయాలి.
సంతపేట మున్సిపల్ హైస్కూల్ పరిధిలో 15 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి.
పరిష్కారం: స్థానికుల సమస్యల్ని నోట్ చేసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చిన అధికారులు... మరికొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. పాంచాలిపురానికి చెందిన రుక్మిణి అనే మహిళ తన ఇంటి పట్టాను రద్దు చేశారని, కూలీ పనులు చేసే తాను బాడుగ చెల్లించలేక పోతున్నానని కమిషనర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన కమిషనర్ ఇంటి పట్టాను మంజూరు చేయాలని ఆదేశించారు.
నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా
ప్రజలిచ్చిన వినతులకు టాప్ ప్రయారిటీ ఇస్తా
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హామీ
శ్రీకాకుళం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్‌లో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో జరిగిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. తమ డివిజన్‌లోని సాయినగర్ కాలనీలోని చాకలి చెరువు నిర్వహణ బాగా లేదని ప్రజలు చెప్పడంతో, అప్పటికప్పుడే కేంద్రమంత్రి తన వెంట అధికారులను తీసుకెళ్లి చెరువును పరిశీలించారు. చెరువును బాగుచేయాలని కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావుకు అక్కడే ఆదేశాలు జారీచేశారు. గంజాయి బ్యాచ్ బెడద ఎక్కువగా ఉన్నదని సాయినగర్ కాలనీవాసులు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా.. మరికొన్ని సమస్యలను ప్రజలు లేవనెత్తారు.
పరిష్కారం: ‘ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందిస్తున్నానని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున అండదండలు అందిస్తామని రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. ‘‘ఈ డివిజన్‌లో అవసరమైన రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనల చేయాలని అధికారులను ఇక్కడే ఆదేశిస్తున్నా. ప్రజలు ఇచ్చిన సమస్యలను, వినతులను టాప్ ప్రయారిటీ ఇచ్చి నెల నుంచి రెండు మాసాల్లో పరిష్కరిస్తాం. నేను కూడా పర్యవేక్షిస్తా’’ అని కేంద్రమంత్రి చెప్పారు.
సమస్యలు :
డ్రైనేజీ కాలువలు బాగు చేయాలి... సీసీ రోడ్లు మంజూరు చేయండి..
పారిశుధ్యం సమస్యలతో దోమలు, కుక్కలు, పాములు, పందుల బెడద ఎక్కువగా ఉంది. ఈ సమస్యల నుంచి విముక్తిని కలిగించండి.
ఇళ్లు మంజూరు చేయండి.
‘జల్‌జీవన్’తో నీటి సమస్యకు శాశ్వతంగా చెక్
విజయవాడ అదనపు కమిషనర్ చంద్రశేఖర్
విజయవాడ: విజయవాడ నగరంలోని 13వ డివిజన్‌లో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, సర్కిల్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) సామ్రాజ్యం పాల్గొన్నారు. స్థానికులు పలు సమస్యలు లేవనెత్తారు.
పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. పైపులైన్లలోకి కలుషిత నీరు వస్తోంది. శానిటేషన్ సమస్యలు. చెత్త సేకరణ సిబ్బందిని పెంచాలి. గంజాయి బ్యాచ్ బెడద పెరిగిపోయింది.
పరిష్కారం: ముందుగా ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. జల్‌జీవన్ మిషన్ పథకం, రక్షిత మంచినీటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణానది నీటిని అందిస్తామన్నారు.
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 10 కోట్లు
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్
ఒంగోలు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్‌లోని ఎన్టీఆర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పార్కు అభివృద్ధి పనులతోపాటు.. డ్రైనేజీ, ట్రాఫిక్, రోడ్ల ఆక్రమణ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పార్కు అభివృద్ధితోపాటు డ్రైనేజీ సమస్యను పక్షం రోజుల్లో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.10 కోట్లను కేటాయించి దశల వారీగా పూర్తి చేస్తామని తెలిపారు.
పార్కు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు
విజయనగరం ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు హామీ
ప్రభుత్వాస్పత్రి వ్యర్థాలు, రోడ్డు ఆక్రమణలపై ఫిర్యాదులు
విజయనగరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ పరిధి 43వ డివిజన్ ఉడాకాలనీలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా కార్యక్రమాన్ని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ మంగళవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, అధికారులు పాల్గొన్నారు. కాలనీవాసులు పెద్దసంఖ్యలో హాజరై తమ సమస్యలను విన్నవించారు.
పరిష్కారం: పార్కు ప్రహరీ నిర్మాణానికి రూ.5లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు తెలిపారు. రూ.6లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ పి.నల్లనయ్య పేర్కొన్నారు. కాగా, గత ప్రభుత్వంలో డివిజన్‌లో అనేక సమస్యలు పరిష్కారం కాక మిగిలిపోయాయని వైసీపీ కార్పొరేటర్ సత్యవతి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభు త్వంలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రశంసించారు.
సమస్యలివీ..: ఉడా కాలనీలోని అక్కడున్న పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. బోరుకు మరమ్మతులు చేపట్టడంతో పాటు ప్రహరీ నిర్మించాలి. ఇళ్ల నుంచి చెత్త తరలింపునకు వీలుగా చెత్త కుండీ ఏర్పాటు చేయాలి. అయ్యన్నపేట రోడ్డులో ఆక్రమణలు తొలగించాలి. వాటర్ ట్యాంక్ నిర్మించాలి. కాలువలో ప్రభుత్వాస్పత్రి వ్యర్థాలు కాలనీ వైపు రాకుండా చూడాలి.
రూ.వంద కోట్లతో వినుకొండ అభివృద్ధి
అందులో 5 కోట్లు విరాళంగా ఇస్తా: జీవీ ఆంజనేయులు
వినుకొండ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వినుకొండలో కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కమిషనర్ సుభాశ్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. గాయత్రినగర్, కొట్నాల్చ వీధిలో తాగునీటి పైపులైన్ కోసం సిమెంట్ రోడ్డు పగలు గొట్టారు. ఆ రోడ్డును అలాగే వదిలేశారు. మురుగు కాల్వలు లేవు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. కాల్వ కట్ట మొదటి వీధిలో సిమెంట్ రోడ్డు, డ్రెయిన్లు, ఎన్‌ఎస్పీ కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరారు. దీనిపై ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ అభివృద్ధి శివశక్తి ఫౌంటేషన్ కింద రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. మ్యాచింగ్ గ్రాంటు కింద రూ.95 కోట్లు కోరతానని.. మొత్తం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. గాయత్రీనగర్‌లో సీసీ రోడ్లు.. మురుగు కాలవ, ఎన్‌ఎస్పీ కాలువపై బ్రిడ్జి.. వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘జగనన్న కాలనీ’ పరిహారం ఇప్పిస్తా
బాధితులకు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి భరోసా
పుట్టపర్తి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మేజర్ పంచాయతీలోని బీసీ కాలనీలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 450 మందికిపైగా ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రస్తావించారు.
సమస్యలు:
జగనన్న లేఅవుట్ల కోసం ముగ్గురు రైతుల నుంచి 14 ఎకరాలు తీసుకున్నారని, పరిహారం ఇవ్వకుండానే ప్లాట్లు వేశారని, అదేమంటే పోలీసులతో బెదిరించేవారని రైతు నాగేంద్ర ప్రసాద్ వాపోయారు.
జగనన్న లే అవుట్ దారి కోసం 1.35 ఎకరాల పట్టా భూమి తీసుకున్నారని, పరిహారం కింద రూ.50 లక్షలు, 2ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి, చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని రైతు నవీన్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పది రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా
అనంత అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వరప్రసాద్ హామీ
అనంతపురం, జనవవరి 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరంలోని 32వ డివిజన్ ఆదర్శ కాలనీలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ మల్లికార్జున రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలు 500 మందికిగా తమ సమస్యలను తెలిపారు.
సమస్యలు: సింగిల్ ఫేజ్ కరెంటుతో ఇబ్బంది పడుతున్నామనీ, .త్రిఫేజ్ ఏర్పాటు చేయాలని దాసరి శ్రీనివాసులు కోరారు. రైతు బజారు ఏర్పాటు చేయాలని వ్యాపారి నరసింహారెడ్డి విజ్ఞప్తిచేశారు. కార్పొరేషన్ ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటుచేయాలని రాజారెడ్డి కోరారు.
పరిష్కారం : ప్రజలు లేవనెత్తిన సమస్యలను ఎమ్మెల్యే, అధికారులు నోట్ చేసుకున్నారు. అన్ని సమస్యలనూ పది రోజుల్లోపు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రజలకు హామీ ఇచ్చారు.
పరిష్కారం:
ఈఅంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దారు బాలాంజనేయులును ఎమ్మెల్యే ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పరిహారం అందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
విశాఖలో భూ ఆక్రమణలకు త్వరలో చెక్
విశాఖపట్నం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గాజువాక నియోజకవర్గంలోని తిరుమలనగర్‌లో కార్యక్రమం జరిగింది. అనధికార డంపింగ్ యార్డును తరలిస్తామని, పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ ఏఎంహెచ్‌వో చెప్పారు. గాంధీబొమ్మ జంక్షన్‌కు బస్సు పునరుద్ధరిస్తామని డిపో ట్రాఫిక్ మేనేజర్ హామీ ఇచ్చారు. వడ్లపూడిలో డ్రెనేజీల నిర్మాణానికి నిధులు మంజూరుకు చేస్తానని కార్పొరేటర్ బొండా జగన్ హామీ ఇచ్చారు.
అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో కోట్నివీధిలో మురుగు కాలువల్లోని నీరు రోడ్లపైకి వస్తోందని, లక్ష్మీనారాయణనగర్‌లో పార్కు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింద ని, ఆకతాయిలు గంజాయి సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు చెప్పారు. మురుగు సమస్యకు పరిష్కారం చూపుతామని, పార్కులో సిమెంట్ బల్లలు బాగు చేయిస్తామని కార్పొరేటర్ చినతల్లి, పార్కులో గస్తీ ఏర్పాటు చేస్తామని సీఐ హామీ ఇచ్చారు.