Tuni Municipal Election: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:41 PM
Tuni Municipal Election: కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు పది మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం పది మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కాకినాడ, ఫిబ్రవరి 18: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్ళీ ఎన్నిక ఎప్పుడనేది త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు పరిస్థితి వివరించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతీ సారీ హాజరవుతున్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నుల్లోనే 17 మంది వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఎన్నికకు రాకుండా చేస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అయితే తిరిగి ఎన్నిక ఎప్పుడు నిర్వాహిస్తామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని తెలిపారు. రెండు సార్లు కోరం లేకపోతే కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహించే నిబంధన ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు.
YS Jagan: విజయవాడ జైలుకు జగన్.. వంశీకి పరామర్శ
కాగా.. వైఎస్ చైర్మన్ ఎన్నిక వేళ తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నిక కోసం ఈరోజు ఉదయం 10 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రానీయకుండా నిర్బంధించారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికకు సిద్ధంగా ఉంటే వైసీపీ కౌన్సిలర్లను ఎందుకు దాచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కౌన్సిలర్లు దాచిన ప్రదేశానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కౌన్సిలర్లు తోసేశారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు వెళితే ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తెలుగు దేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుసగా నాలుగు సార్లు ఎన్నికకు హాజరైనప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక జరగడం లేదని టీడీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. దాదాపు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే వారందరినీ నిర్బంధించి వైసీపీ డ్రామాలాడుతోందని.. అందుకే ఎన్నికల ప్రతీసారి వాయిదా పడుతూ వస్తోందని టీడీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News