RGV CID Enquiry: సీఐడీకీ షాకిచ్చిన ఆర్జీవీ.. విచారణకు డుమ్మా
ABN , Publish Date - Feb 10 , 2025 | 02:05 PM
RGV: గుంటూరు సీఐడీకి షాకిచ్చారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. విచారణకు డుమ్మా కొట్టారు ఆర్జీవీ.

గుంటూరు, ఫిబ్రవరి 10: గుంటూరు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. ఈరోజు (సోమవారం) విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని నిన్ననే సీఐడీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఆర్జీవీ తరపున అతని న్యాయవాది నాని బాబు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఎనిమిది వారాల పాటు విచారణకు హాజరుకాలేరని.. ఎనిమిది వారాల పాటు సమయం ఇవ్వాలని లిఖిత పూర్వకంగా సీఐడీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సీఐడీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని ఆర్జీవీపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆర్జీవీ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఐడీ కూడా ఆర్జీవీని విచారించాలని నిర్ణయించింది. అయితే సీఐడీ విచారణకు దర్శకుడు గైర్హాజరవడంతో తదుపరి కార్యచరణ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆర్జీవీ అడ్వకేట్ ఏమన్నారంటే..
ఇవాళ సీఐడీ అధికారులు విచారణ కోసం డైరెక్టర్ రాంగోపాల్ వర్మను గుంటూరు సీఐడీ కార్యాలయానికి రమ్మన్నారని.. విచారణ హాజరుకావడానికి కొంత టైం అడిగామమని న్యాయవాది నానిబాబు తెలిపారు. దానికి సంబంధించిన వినతి పత్రాన్ని అధికారులకు అందించామన్నారు. సీఐడీ విచారణకు హాజరుకావడానికి రాంగోపాల్ వర్మ 8 వారాలు టైం అడిగారని ఆర్జీవీ అడ్వకేట్ నానిబాబు వెల్లడించారు.
కాగా.. ఇటీవల ఒంగోలు సీఐ ముందు ఆర్జీవీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరుకాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు ఆర్జీవీ. ఈనెల 4న విచారణకు రావాలని పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈనెల 7న విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ. దాదాపు 12 గంటల పాటు ఆర్జీవీ విచారణ కొనసాగింది.
ఇవి కూడా చదవండి...
Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు
అదొక్కటి గుర్తుపెట్టుకోండి.. స్టూడెంట్స్‌కు మోడీ సజెషన్
Read Latest AP News And Telugu News