Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు
ABN , Publish Date - Mar 15 , 2025 | 09:30 AM
Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

కడప, మార్చి 15: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy) నివాళులర్పించారు. పులివెందుల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబసభ్యులు నిబవాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ...మా తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నా రని మండిపడ్డారు. విచారణ జరగట్లేదు ట్రైల్స్ నడవట్లేదు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు.
Amaravati: అమరావతికి ప్రధాని మోదీ!
హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుల కంటే తమకు , తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. సీబీఐ వారు మళ్ళీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నానన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని కోరారు. సాక్షులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారన్నారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్ సునీత రెడ్డి స్పష్టం చేశారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పాల్గొని.. వివేకాకు నివాళులర్పించారు.
ఇదీ జరిగింది...
కాగా.. 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యాడు. అయితే దీన్ని మొదట గుండెపోటు అని రక్తపు వాంతులంటూ తెగ ప్రచారం చేశారు. సొంత బాబాయి హత్యను కూడా జగన్ తన ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీపై అంబాడాలు వేశారు. సీబీఐ విచారణ అంటూ హడావుడి చేశారు జగన్. కానీ జగన్ సీఎం అయ్యాక మాత్రం వివేక హత్య కేసు విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన వివేక కుమార్తె సునీత.. సీబీఐ విచారణ కోరగా.. అందుకు హైకోర్టు కూడా అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది.
ఆ తరువాత వివేక హత్యకు సంబంధించి ఒక్కో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది గుండెపోటు కాదని హత్యని నిర్ధారించారు. అంతే కాకుండా ఈ కేసు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డితోపాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి.. మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. అయితే దస్తగిరి మాత్రం అప్రూవర్‌గా మారిపోయారు. దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయ్యారు కూడా. ఆరేళ్లుగా సీబీఐ విచారణను కొనసాగిస్తూనే ఉంది. అనేకమంది అనుమానితులను ఇప్పటికే విచారించింది సీబీఐ. మరోవైపు ఈకేసుతో సంబంధం ఉన్న పలువురు మరణించడం కూడా అనుమానాలకు దారి తీసింది. సాక్షులపై ఒత్తిళ్లు, బెదిరింపులు కూడా జరిగాయి.
అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వైఎస్ సునీత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. తన తండ్రికి న్యాయం జరగడం కోసం పోరాడుతూనే ఉన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ కేసు నత్తనడకన సాగిందనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడైనా సునీతకు న్యాయం జరుగుతుందా... ఈ కేసులో ఉన్న వారికి శిక్ష పడుతుందా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే
Singarakonda Tirunallu:కనుల పండువగా సింగరకొండ తిరునాళ్లు
Read Latest AP News And Telugu News