Students Missing: అదృశ్యమైన ఇంటర్మీడియట్ విద్యార్థినిలు.. సంచలనం సృష్టిస్తున్న ఘటన..
ABN , Publish Date - Feb 20 , 2025 | 10:24 AM
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విద్యార్థినిల అదృశ్యం కలకలం రేపుతోంది. ముస్తాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినిలు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

విజయవాడ: ఇటీవల కాలంలో విద్యార్థినిల అదృశ్యం కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. తల్లిదండ్రులు తిట్టారని, టీచర్లు మందలించారని, చదువు ఇష్టంలేదని, ప్రేమించిన వారు మోసం చేశారని ఇలా వివిధ కారణాలతో యువతులు ఇళ్లు, హాస్టళ్ల నుంచి పారిపోతున్నారు. మరోవైపు విహారయాత్రల పేరుతో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసిన ఉదంతాలూ ఎన్నో వెలుగు చూశాయి. అలాగే దక్షిణ కొరియా పాప్ సింగర్స్ బీటీఎస్‌ను కలిసేందుకు సైతం భారత్ నుంచి చాలా మంది అమ్మాయిలు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇలా వివిధ కారణాలతో విద్యార్థినిలు సడెన్‌గా వెళ్లిపోతూ కన్నవారిని, పోలీసులను కంగారు పెడుతున్నారు.
తాజాగా అలాంటి ఘటనే కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థినిలు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముస్తాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినిలు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కాలేజీ హాస్టల్ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా ఒక్కసారిగా వెళ్లిపోయారు. తమ స్నేహితులు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో కళాశాల సిబ్బందికి తోటి విద్యార్థినిలు సమాచారం అందించారు.
కళాశాల మెుత్తం వెతికినా వారి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఖాకీలు దర్యాప్తు చేపట్టారు. అయితే విద్యార్థినిలు హైదరాబాద్ వైపు వెళ్తున్నారని సమాచారం అందడంతో వారి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అందరూ కలిసే వెళ్లారా? లేక ఎవరికి వారు వెళ్లిపోయారా?, ఎక్కడికి వెళ్తున్నారనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, విద్యార్థినిల అదృశ్యం సంచలనం సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
East Godavari: రహస్య ప్రాంతంలో కోడి పందేలు.. ఎంటరైన పోలీసులు.. చివరికి..
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్ చెప్పిన బులియన్ మార్కెట్.. బంగారం, వెండి ధరలు ఇవే..