AP News: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం..
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:18 PM
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు.

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇవాళ (గురువారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని పోలీసులకు చెప్పారు. ఈ మేరకు సత్యవర్ధన్‌ను పోలీసులు విచారించగా నిజమేనని తేలింది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
అయితే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ సహా వైసీపీ హయాంలో మట్టి కుంభకోణంపైనా వంశీపై కేసులు నమోదు అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నకిలీ పట్టాల కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు గతంలో తేల్చారు. అయితే అప్పట్లో విచారణ సరిగ్గా జరగలేదంటూ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కేసులు రీఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసులు పునఃవిచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదులపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రూ.210 కోట్ల మేర అక్రమ తవ్వకాలు జరిగాయని తేల్చింది. రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండానే తవ్వకాలు జరిపారని, అక్రమ తవ్వకాలతోపాటు విధించిన జరిమానా మొత్తం కలిపి ఆ విలువ రూ.210 కోట్లకు చేరిందని అధికారులు నివేదిక రూపొందించారు. అయితే విజిలెన్స్ ఫైల్ ఏపీ ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌ను కూడా ఎన్డీయే ప్రభుత్వం త్వరలో బయటకు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణను ఏసీబీ లేదా సీఐడీ అప్పగించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వంశీకి కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఈ కేసులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఏం అన్నారంటే..
Eluru: మీరు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా.. వైసీపీ నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే..