Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:47 AM
‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

సుముఖంగా ఉన్న సీఎం: రామ్మోహన్ నాయుడు
సెంచూరియన్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
నెల్లిమర్ల, జనవరి 11(ఆంద్రజ్యోతి): ‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సూపర్ బి ఏరోనాటిక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్‌ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో డ్రోన్‌ల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి వాడకాన్ని పెంపొందించాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. భవిష్యత్తులో డ్రోన్‌లకు సంబంధించి ఉత్తరాంధ్రలో సెంచూరియన్ ప్రధాన కేంద్రంగా మారబోతుంది. ఇక్కడ డ్రోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు వాటిపై అవగాహన పెరగడంతో పాటు పరిశ్రమలు, మార్కెట్ అవసరాలను తీర్చడానికి దోహదపడుతుంది. వ్యవసాయ రంగంలో పురుగు మందు వాడకాన్ని తగ్గించాలన్నా, వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గాలన్నా డ్రోన్ వినియోగం పెరగాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రోన్‌ల వాడకాన్ని పెంపొందించేందుకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశ పెట్టారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో డ్రోన్‌ల హబ్ ఏర్పాటు చేసేందుకు డ్రోన్ పాలసీ తీసుకువచ్చారు’ అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధి గురించి వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు వారికి వివరించారు.