Nara Lokesh: పేదరిక నిర్మూలనే లక్ష్యం
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:11 AM
సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. కక్షసాధింపు మా విధానం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం.

కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు
కలసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ పూర్తి
విద్యా సంవత్సరం ప్రారంభంలోగా కొత్త టీచర్లు
ఏప్రిల్, మేల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ
రాష్ట్రం కోసమే కేంద్రానికి బేషరతుగా మద్దతు
శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్
‘‘రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా అవసరం. మేం బేషరతుగా ఎన్‌డీయేలో చేరాం. ఐదేళ్లలో మీరు (వైసీపీ) తీసుకురాలేని నిధులు మేం 9 నెలల్లో తెచ్చాం. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం’’
- మంత్రి నారా లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘‘పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తాం. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. కక్షసాధింపు మా విధానం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం. కలసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం’’ అని మంత్రి నారా లోకేశ్ శాసన మండలిలో వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులతోపాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మా లక్ష్యం. అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీలో నాటి ప్రతిపక్షనేత (జగన్) చెప్పారు. ప్రధాని మోదీ వచ్చి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రతిజిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాం’’ అని అన్నారు. కాగా, మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. పలు అంశాలపై లోకేశ్ దీటుగా సమాధానం చెప్పారు.
ఒక్క చాన్స్ పేరుతో రాష్ట్రానికి నష్టం
2019లో ప్రజలు ఒక్క చాన్స్ మాయలోపడి వైసీపీకి అధికారం ఇవ్వడంతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. ఒక్క డీఎస్సీలేదు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? జేట్యాక్స్‌ల కోసం పీపీఏలు రద్దు చేశారు. పీపీఎల రద్దు వల్ల ప్రధాన పెట్టుబడిదారులు పారిపోయారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులలాంటివి. అభివృద్ధి చేస్తే ట్యాక్సులు పెరుగుతాయి. గత ప్రభుత్వం అప్పులతో సంక్షేమం చేయడంతో రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగాం. ఆ అప్పులపై రూ.5వేల కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. గత పాలకులు అమరావతిని సర్వనాశనం చేశారు’’ అని లోకేశ్ నిప్పులు చెరిగారు.
నాపై 23 కేసులు పెట్టారు!
అయిదేళ్ల అరాచకపాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని లోకేశ్ అన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకులపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారు. 8 నెలలుగా మేం ఒక్క తప్పుడు కేసు పెట్టలేదు. నాపై 23 కేసులు పెట్టారు. నా తల్లిని నన్ను, శాసనమండలి చైర్మన్ షరీ్‌ఫను అవమానించారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై యథేచ్చగా దాడులు చేశారు. మాపై బాధ్యత పెరిగింది. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు కష్టపడుతున్నాం. మేం పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తల వద్దకు వెళుతుంటే మళ్లీ జగన్ రారని గ్యారెంటీ అడుగుతున్నారు’’ అన్నారు. ‘ఇచ్చిన మాట ప్రకారం అయిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. గత ఎనిమిది నెలల్లో 6.4 లక్షల కోట్లు పెట్టుబడులు రప్పించాం. వీటి ద్వారా 4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మెగా డీఎస్సీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యమైంది. ఏప్రిల్, మే నెలల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే కొత్త ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చేలా చేస్తాం. పెన్షన్లు ఒకేసారి రూ.వెయ్యి పెంచాం. ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించాం. ఏప్రిల్, మే నెలల్లో ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. అన్నదాత సుఖీభవను కూడా ఇస్తాం’ అని చెప్పారు.
రాష్ట్రం కోసం మద్దతు
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని తెలుగు, ఇంగ్లి ష్‌లో ప్రచురించారని, ఈ రెంటి మధ్య తేడా ఉందని వైసీపీ సభ్యులు పేర్కొనడంతో మండలిలో గందరగోళం నెలకొంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని గవర్నర్ ప్రసంగంలో ఉందని కల్యాణి అన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలపై లోకేశ్ అభ్యంతరం తెలిపారు. తాము ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడా చెప్పలేదని, ఉద్యోగావకాశాలు కల్పించామనే చెప్పామని పేర్కొన్నారు. ఇక, టీడీపీ మద్దతు మీదే కేంద్రం ఆధారపడి ఉందని తాము చెబుతున్నట్లు కల్యాణి చెప్పిన అసత్యాలను వెనక్కి తీసుకోవాలని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ సమయంలో వాకౌట్ చేయబోయిన వైసీపీ సభ్యులను ఉద్దేశించి.. ‘‘వాకౌట్ చేయొద్దు. అన్నింటిపైనా చర్చిద్దాం’’ అని లోకేశ్ అన్నారు. ‘‘ఇంగ్లీషు మీడియం కావాలంటారు. మళ్లీ ఇంగ్లీషులో చెప్తే అర్థం కాదని అంటారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ‘‘గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని, తప్పుంటే మార్చుకుంటామని చెప్పండి’’ అన్నారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు?
‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గైడ్‌లైన్స్‌ను అనుసరించాల్సి ఉంది. దీనిలో లోక్‌సభ స్పీకర్ డైరెక్షన్‌లో ‘కండిషన్స్ ఫర్ రికగ్నిషన్’ పేజీ నెంబర్ 62లో 121-సీ పాయింట్‌లో టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్‌లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. 2009 అసెంబ్లీకి సంబంధించి కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి 2019, జూన్‌లో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు, ఐదుగురిని లాగేస్తే 17 లేదా 18 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా ప్రతిపక్ష హోదా అడుగుతారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో సమస్యలపై చర్చ జరగాలి’’ అని శాసన మండలిలో మంత్రి లోకేశ్ అన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే ఏం చేశారు?
‘‘కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పులివెందుల ఎమ్మెల్యే ఐదేళ్లు ఏం చేశారు. గత ఐదేళ్లలో కేంద్రంలో అన్ని బిల్లులకూ సపోర్టు చేశారు. మరి ఏపీకి ఏం చేశారో? ఏం తెచ్చారో? వైసీపీ సభ్యులు సమాధానం చెప్పాలి’’ అని మండలిలో లోకేశ్ నిలదీశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తాము బెదిరించామంటూ వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వాటిని వెనక్కి తీసుకోవాలని, రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ వ్యాఖ్యలపై రికార్డులను పరిశీలించి అభ్యంతరకరంగా ఉంటే తొలగిస్తామని చైర్మన్ మోషేన్‌రాజు చెప్పడంతో సద్దుమణిగింది.