AP Deputy CM : క్లస్టర్ వ్యవస్థకు కొత్తరూపు
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:31 AM
గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను....

పంచాయతీల ఆదాయం, జనాభా ప్రాతిపదికన కొత్త గ్రేడ్లు
గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపులు
గ్రామ పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు
వ్యవస్థ బలోపేతానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం
అధ్యయనం కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి సంస్థలుగా తీర్చిదిద్దడానికి చర్యలు ప్రారంభించారు. గతంలో గ్రామ పంచాయతీలను ఆదాయపరంగా గ్రేడ్లుగా విభజించారు. ఆ విధానం వల్ల అధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు పలు అంశాలల్లో నష్టం వాటిల్లుతోంది. దీంతో సిబ్బంది సర్దుబాటు అసంబద్ధంగా ఉందని గమనించిన ఉపముఖ్యమంత్రి.. గ్రామ పంచాయతీలను ఆదాయపరంగానే కాకుండా జనాభాను కూడా దృష్టిలో ఉంచుకుని పంచాయతీల గ్రేడ్లను పునర్యవస్థీకరించాలని నిర్ణయించారు. దానిపై అధ్యయనం కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే సిఫారసులను దృష్టిలో ఉంచుకుని గ్రేడ్‌లను పునర్‌వ్యస్థీకరిస్తారు. ఆ గ్రేడ్‌ల ఆధారంగా సిబ్బందిని నియమిస్తారు. పంచాయతీరాజ్‌శాఖ నుంచి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా యూనిట్‌గా 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకుని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది.