Share News

PM Narendra Modi : నవ్యాంధ్రకు నవశకం

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:06 AM

ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.

PM Narendra Modi  : నవ్యాంధ్రకు నవశకం

  • రూ.2 లక్షల కోట్లకుపైగా భారీ ప్రాజెక్టులు

  • నేడు విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే రూ.1.85 లక్షల కోట్లు

  • రోడ్డు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేలకోట్లు

  • ఇంకా.. 10కిపైగా కీలక ప్రాజెక్టులకూ శంకుస్థాపన

  • 6కు పైగా రోడ్లు, రైల్వే లైన్లు జాతికి అంకితం

  • చంద్రబాబు, పవన్‌తో కలిసి బటన్‌ నొక్కనున్న పీఎం

  • అభివృద్ధిలో ఏపీని మరోఎత్తుకు చేర్చేలా కార్యక్రమాలు

  • కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీకి తొలిసారి మోదీ

  • ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో భారీ సభ

  • వేదికపై ప్రధాని, గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం..

  • విశాఖలో గడిపేందుకు ఎదురుచూస్తున్నా

‘‘విశాఖపట్నం ప్రజల మధ్య గడిపేందుకు ఎదురుచూస్తున్నాను. నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌లో భాగంగా తొలి హబ్‌ అయిన ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుండటం చాలా సంతోషకరం. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, తిరుపతి జిల్లాలోని చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగమైన కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం (క్రిస్‌ సిటీ) శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను’’

- ప్రధాని నరేంద్ర మోదీ (ఎక్స్‌ సందేశం)

  • రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు

’’రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నా. రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనుండటం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు. ప్రధానికి స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా అందరం ఎదురుచూస్తున్నాం’’

- సీఎం చంద్రబాబు (ఎక్స్‌ సందేశం)

  • జాతికి అంకితం చేసేవి..

1)ఎన్‌హెచ్‌-16లో చిలకలూరిపేట బైపాస్‌ ఆరు వరుసల రహదారి

2)ఎన్‌హెచ్‌-216 నుంచి రేపల్లె-ఈపూరుపాలెం సెక్షన్‌ రెండు వరుసల రహదారి

3)బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ రోడ్‌ సెక్షన్‌లో నాలుగు వరుసల రహదారి.

4)బెజవాడ-గుడివాడ-భీమవరం, నర్సాపూర్‌, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు రైల్వే లైన్‌ డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌

5)గుత్తి-ధర్మవరం వరకు రైల్వే లైన్‌ డబ్లింగ్‌

6)గిద్దలూరు నుంచి దిగువమెట్ట వరకు పూర్తయిన రైల్వే లైన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్ట్‌.


విశాఖపట్నం, అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5వేల కోట్లు. వీటితోపాటు మరో 10కిపైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం, పోలీసు విభాగాలను సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ ద్వారకా తిరుమల రావు అప్రమత్తం చేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలోని రహదారిని ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, సత్యకుమార్‌, టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్‌ ఉంటారు. ప్రధానికి కుడి వైపున గవర్నర్‌, ఎడమ వైపున ముఖ్యమంత్రికి సీట్లు కేటాయించారు. పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు ప్రసంగించిన తరువాత ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించినఅనంతరం ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అనువదిస్తారు.

Untitled-3 copy.jpg


చిన్నపొరపాటు కూడా జరగొద్దు: సీఎస్‌, డీజీపీ

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధాని పర్యటనలో ఏ చిన్న పొరబాటుకూ ఆస్కారం లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ వీసీలో డీజీపీ ద్వారకా తిరుమలరావు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఎస్పీజీ సమన్వయంతో పోలీ్‌స శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోడ్‌ షో కోసం, సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్‌ హరీంధర ప్రసాద్‌ వివరించారు.

ఇంధన క్షేత్రంలో మైలురాయి.. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

భారతదేశ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ముఖ్యమైన మైలురాయి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌- న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కలిసి దీనిని ఏర్పాటుచేస్తున్నాయి. బుధవారం ప్రధాని శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగంలోనే మొట్టమొదటిది. ప్రాజెక్టు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 300ఎకరాల విస్తీర్ణంలో 25 పారిశ్రామిక మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు, ఇంకో 300 ఎకరాల్లో యుటిలిటీస్‌, సౌకర్యాలు, లాజిస్టిక్స్‌, రోడ్లు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్తు, నీటి సౌకర్యం, డీశాలినేషన్‌ ప్లాంట్లు, ఓడరేవు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. దీనిపై సీఎస్‌ విజయానంద్‌ మంగళవారం విద్యుత్తు వినియో గ సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Untitled-3 copy.jpg


శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు..

ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. వేదికపై కూటమి పార్టీల నేతలంతా కనిపించనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంద్వేశరి పాల్గొననున్నారు.

  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

  • అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు శంకుస్థాపన.

  • కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్‌ నోడ్‌.

  • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన.

  • ఆదోని పట్టణం నుంచి ఎన్‌హెచ్‌-167ను కలుపుతూ బైపాస్‌ రహదారి

  • కొండమోరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ

  • సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ

  • వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు ఎన్‌హెచ్‌-440 నాలుగు లేన్లకు విస్తరణ

  • ఎన్‌హెచ్‌-516 నుంచి పాడేరు బైపాస్‌ రహదారి నిర్మాణం

  • గుంటూరు నుంచి బీబీ నగర్‌ వరకు రైల్వే లైన్‌ డబ్లింగ్‌

  • మహబూబ్‌ నగర్‌ నుంచి కర్నూల్‌ మీదుగా డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌

  • గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌.

  • రూ.19,500 కోట్ల విలువైన రహదారులు, రైల్వే ప్రాజెక్టులు.. ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.


  • షెడ్యూల్‌ ఇలా..

బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్‌ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు.

Updated Date - Jan 08 , 2025 | 03:06 AM