Share News

AP Police : వంశీని కస్టడీలో విచారించాలి

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:14 AM

వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు.

AP Police : వంశీని కస్టడీలో విచారించాలి
Vallabhaneni Vamsi

  • ఆయన ఫోన్‌, కారు స్వాధీనం చేసుకోవాలి

  • సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయాలి

  • సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత దర్యాప్తు అవసరం

  • ఎస్సీ, ఎస్టీ కోర్టుకు పోలీసుల వినతి

  • నన్ను కస్టడీకి ఇచ్చినా సమయం వృథా

  • నా వస్తువులు పోలీసులకు అప్పగించాల్సిన పనిలేదు

  • వ్యక్తిగత అఫిడవిట్‌ వేసిన వంశీ

  • విచారణ నేటికి వాయిదా

విజయవాడ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందని కూడా తెలిపారు. ‘ఆయన ఫోన్‌ను రికవరీ చేయాల్సి ఉంది. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి హైదరాబాద్‌ తీసుకెళ్లినప్పుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవాలి. ఈ కారణాల రీత్యా వంశీని కస్టడీకి ఇవ్వండి’ అని అభ్యర్థించారు. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. వారి తరఫున ప్రాసిక్యూషన్స్‌ జేడీ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో 11 మంది నిందితులు ఉన్నారని.. వారిలో ఐదుగురు మాత్రమే అరెస్టయ్యారని.. మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వంశీ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అవసరం లేదన్నారు. సత్యవర్ధన్‌ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే అసలు కోణాలు బయటకు వస్తాయని చెప్పారు. కిడ్నా్‌పకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవడానికి వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం న్యాయాధికారి హిమబిందు విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాగా.. వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు రెండ్రోజుల సమయం కావాలని ప్రాసిక్యూషన్స్‌ జేడీ రాజేంద్రప్రసాద్‌ కోరగా.. కోర్టు సమ్మతించింది.


అలాగే సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఖైదీలుగా ఉన్న వెంకట శివరామకృష్ణ ప్రసాద్‌ (ఏ-7), నిమ్మ లక్ష్మీపతి(ఏ-8) బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ జరుపనుంది.

నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు: వంశీ

తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీ బుధవారం కోర్టుకు వ్యక్తిగత అఫిడవిట్‌ సమర్పించారు. ‘నేను పోలీసులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కస్టడీకి ఇచ్చినా సమయం వృథా. రాజ్యాగంలోని 20(3) ప్రకారం నాకు సంబంధించిన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మర్నాడే నేను ఎక్కడున్నానో ట్రాక్‌ చేసి అరెస్టు చేశారు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని కస్టడీకి కోరుతున్నారు? దర్యాప్తు చేయకుండానే నన్ను అరెస్టు చేశారా? సత్యవర్ధన్‌ బయటే ఉన్నాడు. అతడిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం నేను రిమాండ్‌ ఖైదీగా ఉన్నాను. నా వద్ద ఎలాంటి వస్తువులు లేవు. దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా దర్యాప్తు ఏమిటి’ అని పేర్కొన్నారు. సత్యవర్ధన్‌ను ఏ-5గా పేర్కొంటూ పోలీసులు క్రైం నంబరు 84/2025తో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని అఫిడవిట్‌కు జత చేశారు. కాగా, విజయవాడ జిల్లా కారాగారంలో వంశీకి కల్పిస్తున్న సదుపాయాలపై కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని జైలు అధికారులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆదేశించింది. తనకు ఇంటికి నుంచి భోజనాన్ని అనుమతించాలని, మంచం కేటాయించాలని ఆయన వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది.

Updated Date - Feb 20 , 2025 | 09:28 AM