YSRCP: ఇంత మోసమా.. వైసీపీ మార్క్ మాయాజాలం..
ABN , Publish Date - Jan 09 , 2025 | 03:30 PM
పొదిలి ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసింది. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడంతో ఆ ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వైసీపీ మోసం బయటపడింది.
దర్శి సాగర్ కాలువ నుంచి పైపులైన్ ద్వారా నీటిని తెచ్చుకోవడం పొదిలి ప్రజల చిరకాల స్వప్నం. ఆ కలను తాము నిజం చేస్తూన్నామంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో డాంబికాలు పలికింది. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి స్వయంగా పనులు ప్రారంభిస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. చోటామోటా నేతల నుంచి ప్రజాప్రతినిధులు వరకు అందరూ అది తమ కీర్తిగా చెప్పుకున్నారు. అనుకున్నదే తడువుగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఈ పనులకు అసలు ఆర్థికశాఖ అనుమతే లేదు. దీంతో విషయం తెలిసి కాంట్రాక్టర్ కాడి కించేశారు. ఇప్పటివరకు రూ.30కోట్ల మేర ఖర్చుపెట్టినట్లు పేర్కొంటున్న అతను తన పెట్టుబడి కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే ఉత్తుత్తి జీవోలు
అభివృద్ధి పనులు చేపట్టకుండానే చేసినట్లు చూపి ప్రజలను మభ్యపెట్టడం వైసీపీకే చెల్లుతోంది. వెలిగొండ పూర్తికాకుండానే జాతికి అంకితం చేస్తున్నామని అప్పటి సీఎం జగన్ రెడ్డి గొప్పలు చెప్పారు. ఐదేళ్ల పాలనలో కనీసం 10 శాతం పనికూడా చేయలేదు. అదే విధంగా దర్శి-కొత్తరెడ్డిపాలెం నుండి పైప్‌లైన్ ద్వారా పొదిలి పెద్దచెరువుకు నీరు తెచ్చి మండల ప్రజల నీటి కష్టాలు తీరుస్తానన్నారు. రూ.50.13 కోట్లతో ఉత్తుత్తి జీవో విడుదల చేశారు. ఇప్పుడు ఆ జీవోకు ఆర్ధిక అనుమతులు లేవని స్పష్టమైంది. ఇప్పటి కూటమి ప్రభుత్వం పంతాలకు పోకుండా నిధులు విడుదల చేయించి పనులు పూర్తిచేయిస్తాం.
- కందుల నారాయణరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే
పొదిలి ప్రజలకు శాపంగా..
సక్రమంగా అనుమతులు తీసుకో కుండా ఎన్నికలకు ముందు హడావుడిగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేసిన మాయాజాలం పొదిలి ప్రజలకు శాపంగా మారింది. ఏళ్లుగా వెంటాడుతున్న తాగునీటి సమస్య తీరుస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికి చివరకు చేతులెత్తేశారు. అధికారులు నేతల బాటలోనే సాగారు. పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టరు పనులు అప్పగించారు. తీరా ఎంబుక్ చేసే సమయంలో పథకం బండారం బయటపడింది. దీంతో నదరు కాంట్రాక్టర్ లబోదిబోమంటూ పనులను అర్ధంతరంగా నిలిపేశారు. వివరాల్లోకి వెళితే.. దర్శి సాగర్ కాలువ నుంచి పైపులైన్ ద్వారా పొదిలి పెద్దచెరువుకు నీటిని నింపి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం గతంలో వైసీపీ ప్రభుత్వం రూ.50.13కోట్ల అంచనాలను ప్రతిపాదించింది. ఈ పనులకు 2022లో పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిదులు ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. 2023 ఏప్రిల్‌లో మార్కాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అప్పటి సీఎం జగన్ పర్చువల్ విధానం ద్వారా భారీ రక్షితనీటి పథకానికి శిలాఫలకం ఆవిష్కరించారు.
అప్పుట్లో భారీగా సంబరాలు..
ప్రజల ఆకాంక్షల మేరకు వైసీపీ హామీ ఇచ్చినట్లు రక్షితనీటి పథకాన్ని ప్రారంభించి పొదిలి ప్రాంత ప్రజల చిరకాలవాంచ నేరవేర్చామని ఆర్భాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పర్యటన తరువాత స్థానిక వైసీపీ నాయకులు అత్యుత్సాహంగా రక్షితనీటి పథకం తెచ్చిన ఘనత మాదేనంటూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రార్ధనలు చేసి నానా హంగామా చేశారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టును రఘురామ పైపలు కంపెనీ దక్కించుకుంది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ పైపులైన్ నిర్మాణ పనులను చురుగ్గా చేపట్టింది. ఇప్పటివరకు రూ.10 కోట్ల మేర పనులు పూర్తిచేశారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. చేసిన పనులకు ఎం బుక్ రికార్డ్ చేసే సమయంలో ఈ పైపులైన్ వర్క్‌కు అసలు ఆర్థిక శాఖ అనుమతులు లేవని బయటపడింది. దీంతో లబోదిబోమనడం కాంట్రాక్టర్ వంతైంది.
ఎంబుక్ చేయడం కష్టమే..
ప్రభుత్వం ఇచ్చిన జీవో నకలు కింది భాగంలో ఆర్థిక అనుమతులు ఉన్నట్లు పొందుపర్చకపోవడంతో ఎం-బుక్ రికార్డ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆర్థిక అనుమతులు లేకుండా టెండర్లు పిలవడంపై అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు తెల్లముఖం వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియ ఎలా నిర్వహించారని ప్రజలు మండిపడుతున్నారు.
ఎనిమిది నెలలుగా నిలిచిన పనులు..
ఎంబుక్ నమోదు కష్టం కావడంతో సదరు కాంట్రాక్టర్ పనులను మధ్యలో నిలిపివేశారు. ఏడెనిమిది నెలలుగా పనులు నిలిచిపోవడంతో పొదిలి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుత శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తిచేయిస్తామని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం పశ్చిమప్రాంత ప్రజలను మభ్యపెట్టిందనే విషయం తేటతెల్లమైంది. ఒకవైపు పనులు పూర్తికాకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం వంటి గారడీలు వైసీపీకే చెల్లుతాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
జీవో ఆధారంగానే పనులు
గత ప్రభుత్వ పాలనలో జరిగేషన్ శాఖ నుంచి రూ.50.13 కోట్లు పైపులైను పనులకు జీవో విడుదలైంది. దాని ఆధారంగానే టెండర్లు పిలిచారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలకు పార్ట్ పేమెంట్ కోసం ఎం-బుక్ నమోదు చేస్తుండగా ఆర్థికశాఖ అనుమతులు లేవని స్పష్ట మైంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో అనుమతులు వస్తాయి. పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం.
- శివరాంప్రసాద్, ఇరిగేషన్ డీఈ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here