Share News

AP Govt : ఇక ప్రతి ఇల్లూ విద్యుత్కేంద్రమే!

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:02 AM

ఇక రాష్ట్రంలో ప్రతి ఇల్లూ సౌర విద్యుత్కేంద్రంగా మారనుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సోమవారం ప్రధాన మంత్రి సూర్యఘర్‌ కార్యక్రమాన్ని ఆయనే లాంఛనంగా ప్రారంభించనున్నారు.

AP Govt : ఇక ప్రతి ఇల్లూ విద్యుత్కేంద్రమే!

  • కుప్పంలో ప్రయోగాత్మకంగా ‘సూర్యఘర్‌’

  • నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • సౌర విద్యుదుత్పత్తి విప్లవానికి శ్రీకారం

  • తర్వాత రాష్ట్రమంతటా విస్తరణ

  • గృహ వినియోగదారులకు ఎంతో మేలు

అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఇక రాష్ట్రంలో ప్రతి ఇల్లూ సౌర విద్యుత్కేంద్రంగా మారనుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సోమవారం ప్రధాన మంత్రి సూర్యఘర్‌ కార్యక్రమాన్ని ఆయనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా కుప్పంలో చేపట్టే పీఎం సూర్యఘర్‌ను రాష్ట్రమంతటికీ విస్తరిస్తారు. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్తు కనెక్షన్లు కలిగిన 50వేల గృహాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధాని సూర్యఘర్‌ కింద గృహాల రూఫ్‌టా్‌పపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియను.. వ్యక్తిగతంలోనూ, సొసైటీ పరంగానూ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన శాఖ అనుమతిస్తోంది. పీఎం సూర్యఘర్‌లో చేరి కిలో వాట్‌ నుంచి రెండు కిలోవాట్‌ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో కూడిన ప్యానళ్లను ఏర్పాటు చేస్తే.. రూ.18000 దాకా సబ్సిడీని కేంద్రం ఇస్తుంది. 2 నుంచి 3 కిలోవాట్‌ల ప్యానళ్లకైతే రూ.30వేల దాకా సబ్సిడీ వస్తుంది. ఇక, 3 కిలోవాట్లు దాటితే రూ.78వేల సబ్సిడీ వస్తుంది. పీఎం సూర్యఘర్‌ పథకాన్ని పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.


పీఎం సూర్యఘర్‌పైనా జగన్‌ నిర్లక్ష్యం

కేంద్రం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వైసీపీ ప్రభుత్వం కన్నెర్రచేస్తూ వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు భరిస్తూ అమలు చేసే పథకాలపై గత సీఎం జగన్‌ నిర్లక్ష్యం చేసూ వచ్చారు. అదే తరహాలో తాము పీఎం సూర్యఘర్‌లో చేరడం లేదంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో.. గడచిన ఐదేళ్లలో ఈ పథకం రాష్ట్రంలో అమలు కాలేదు. ఫలితంగా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని ఉచిత విద్యుత్తు పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. పైపెచ్చు తొమ్మిదిసార్లు జగన్‌ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీల భారాన్ని మోయాల్సి వచ్చింది. సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే.. ప్రతి ఇల్లూ విద్యుదుత్పత్తి కేంద్రంగా మారేంది. ఈ పథకంలో చేరిన వారు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్తును వాడుకుంటూనే, మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తూ కరెంటును అమ్ముకునే అవకాశం దక్కేది.

కూటమి రాకతో వెలుగురేఖలు!

కూటమి ప్రభుత్వం అదికారంలోనికి వచ్చాక పీఎం సూర్యఘర్‌లో చేరేందుకు ఏపీకి అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సెప్టెంబరులో కేంద్రానికి దరఖాస్తును అందించారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ వినియోగించుకోకపోవడాన్ని కేంద్ర ఇంధనశాఖ తప్పుబట్టింది. ఇప్పటికైనా పీఎం సూర్యఘర్‌లో చేరేందుకు ముందుకు వచ్చినందుకు ఏపీని అభినందించింది. రాష్ట్రాన్ని కూడా ఈ పథకంలో కేంద్రం చేర్చింది.


కుప్పంతో మొదలు...

సోమవారం కుప్పం నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. దీనిని రాష్ట్రమంతటికీ విస్తరిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే విద్యుదుత్పత్తి సంస్థలపై ఆధారపడకుండా స్వయం విద్యుత్కేంద్రాలుగా ఇంటి పైకప్పును మార్చుకునే కొత్త సౌరవిద్యుదుత్పత్తి విప్లవం అమలులోనికి రానున్నదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 04:02 AM