Visakhapatnam : ‘లోకల్ బాయ్’ నాని అరెస్టు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:17 AM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడనే అభియోగంపై విశాఖకు చెందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడని అభియోగం
మరి కొందరిపైనా చర్యలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడనే అభియోగంపై విశాఖకు చెందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడు డఫాబెట్, పారీమ్యాచ్, మహదేవ్‌బుక్, రాజాబెట్ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల్లో ఇప్పటికే రూ.2 కోట్లు వరకు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఈ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చంటూ నాని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియో అప్‌లోడ్ చేశాడు. దీనిపై ఆ యువకుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ప్రచారం వల్ల యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని, నానిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లోకల్‌బాయ్ నానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తక్షణం వీడియోలను తొలగించాలని ఆదేశించిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశాడని, అందుకు కొంత డబ్బు కూడా అందినట్లు నిర్ధారణ అయింది. దీంతో నానిని అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. మరికొందరు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. వారిపైనా త్వరలో చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. ఎవరైనా తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించడం, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.