Share News

MLC Elections: విజయం పరిపూర్ణం

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:06 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సంపూర్ణ విజయం సాధించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు నియోజకవర్గంలో కూటమి...

MLC Elections: విజయం పరిపూర్ణం

  • రెండు పట్టభద్ర ఎమ్మెల్సీలూ కూటమి కైవసం

  • కృష్ణా-గుంటూరులో తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆలపాటి విజయ దుందుభి

  • ఉమ్మడి గోదావరిలోనూ కూటమిదే గెలుపు

గుంటూరు/ఏలూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి సంపూర్ణ విజయం సాధించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తిరుగులేని ఆధిక్యంతో ఘనంగా గెలువగా.. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేట్లు తొలిసారి టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించారు. రెండు పట్టభద్రుల సీట్లకు ఓట్ల లెక్కింపు సోమవారం నుంచి మంగళవారం మధ్యాహ్నంవరకు కొనసాగింది. కూటమి అభ్యర్థులిద్దరూ ప్రతి రౌండ్‌లోనూ భారీ మెజారిటీ సాధించారు.

ఆలపాటికి అఖండ మెజారిటీ..

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి ఆఖరి రౌండ్‌ వరకు అంతకంతకూ మెజారిటీ సాధిస్తూ వచ్చారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే మంగళవారం ఉదయం ఫలితం వెలువడింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి-గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చేతుల మీదుగా మధ్యాహ్నం గుంటూరు కలెక్టరేట్‌లో.. ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు ఆయన డిక్లరేషన్‌ ఫాం అందుకున్నారు. ఈ నియోజకవర్గానికి గత నెల 27న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ కేంద్రాలు, పోస్టల్‌ బ్యాలెట్లలో కలిపి మొత్తం 2,41,774 ఓట్లు పోల్‌ అయ్యాయి. పోలైన ఓట్లలో 26,909 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దాంతో మిగిలిన 2,14,865 ఓట్లను లెక్కించారు. వీటిల్లో కోటా ప్రకారం 1,07,433 తొలి ప్రాధాన్య ఓట్లు వస్తే ఆ అభ్యర్థి విజేతగా నిలుస్తారు. కాగా, ఆలపాటికి మొత్తం 1,45,057 ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్‌ పూర్తయ్యే సరికి 82,320 ఓట్లు మెజారిటీ సాధించారు. సమీప ప్రత్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు(పీడీఎఫ్‌) 62,737 ఓట్లు మాత్రమే సాధించారు. బరిలో ఉన్న మిగతా 23 మందిలో ఏ ఒక్కరికీ వెయ్యి ఓట్లు దాటలేదు.


కూటమి ఏకపక్షంగా..

ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుపై ఘనవిజయం సాధించారు. ఓట్లలెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి చివరి వరకు రాజశేఖరం ఆఽధిక్యం ప్రదర్శించారు. పోలైన 2,18,997 ఓట్లలో ఆయనకు 1,24,702 ఓట్లు లభించాయి. మరో రౌండ్‌ ఉండగానే విజయానికి అవసరమైన మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించారు. సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులుకు కేవలం 42,241 ఓట్లు వచ్చాయి. దీంతో రాజశేఖరం 77,461 ఓట్ల ఆధిక్యంతో విజయం పొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పట్టభద్రుల స్థానంలో టీడీపీ గెలుపొందడం దాదాపు ఇదే మొదటిసారి.

‘కూటమి’పై పట్టభద్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

గెలిచిన ఎమ్మెల్సీలకు అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం సాధించారు. దీనితో కూటమి ప్రభుత్వంపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమైంది. కూటమి ప్రభుత్వంపై పట్టభద్రులు, మేధావులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొంటాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 04:06 AM