Anagani Satya Prasad: అనర్హత తప్పించుకోవడానికే సభకు జగన్
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:12 AM
వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అలా వచ్చి ఇలా వెళ్లడాన్ని టీడీపీ నేతలు పలువురు తప్పు పట్టారు. కేవలం శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే సభకు వచ్చారంటూ విరుచుకుపడ్డారు.

చట్ట సభల్ని కించపరిచారు: టీడీపీ ప్రజాప్రతినిధుల విమర్శ
అమరావతి, పులివెందుల టౌన్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలకు జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అలా వచ్చి ఇలా వెళ్లడాన్ని టీడీపీ నేతలు పలువురు తప్పు పట్టారు. కేవలం శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే సభకు వచ్చారంటూ విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ వద్ద పలువురు విలేకరులతో మాట్లాడారు. కొద్ది మంది ప్రకటనల రూపంలో స్పందించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ‘జగన్‌రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే కానీ ప్రజా సమస్యలు కాదు. తన ఎమ్మెల్యే హోదాని రక్షించుకోవడానికే జగన్ సభకు వచ్చారు’ అంటూ విమర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ‘ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్‌రెడ్డి అవమానిస్తున్నారు. ప్రతిపక్ష హోదా అడగడానికి మాత్రమే అసెంబ్లీకి రావడం చట్ట సభల్ని కించపర్చడమే’ అంటూ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘అసెంబ్లీకి రాను, ప్రజా సమస్యలపై పోరాడను అనే నాయకుడు జగన్ తప్ప... చరిత్రలో ఎవ్వరూ లేరు. అసెంబ్లీ వేదికగా ప్రజలకు అబద్ధాలు, అసత్యాలు చెప్పాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. మంత్రి సవిత మాట్లాడుతూ... ‘ప్రజా సమస్యలపై చర్చించడానికి జగన్ అసెంబ్లీకి రావాలి. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకు తగిన సమయం ఇచ్చి, మైకు ఇస్తాం. పులివెందుల ప్రజల సమస్యలపై చర్చకైనా ఆయన రావాలి. సబ్జెక్ట్ పరంగా వైసీపీతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్‌కు లండన్ మెడిసిన్ సరిగ్గా పని చేయడం లేదు. ఎన్నికల కోడ్ సమయంలో మిర్చి యార్డులో రాజకీయాలు మాట్లాడకూడదన్న విషయం కూడా జగన్‌కు తెలియదా?’ అని ప్రశ్నించారు.
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... ‘ప్రతిపక్ష హోదా అనేది ఒక పార్టీనో, వ్యక్తో నిర్ణయించేది కాదనే విషయం ఇన్ని రాజకీయాలు చేస్తున్న జగన్‌కు, వైసీపీ సీనియర్లకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. గతంలో కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర పార్టీలు... ఇద్దరు, ముగ్గురున్నా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం కాకుండా, ప్రజాసమస్యలపై పోరాడే వారు’ అని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా కోసం చట్టం మార్చాలా? లేక ప్రత్యేక చట్టం ఏమైనా తేవాలా?’ అంటూ ఎద్దేవా చేశారు.