Share News

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:28 AM

శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.

River Accident : శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి

  • గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత

  • శ్రీశైలంలో కొడుకును రక్షించబోయి తండ్రీ..

  • బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు..

రాజమహేంద్రవరం, పెనుగంచిప్రోలు, సున్నిపెంట, పెదవేగి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నదుల్లో స్నానానికి వెళ్లిన తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన గర్రె ఆకాశ్‌(17), తిరుమలశెట్టి పవన్‌(19), పడాల దేవదత్త సాయి(18), పడాల రామ దుర్గాప్రసాద్‌(19), అనిశెట్టి పవన్‌ గణేశ్‌(17)తోపాటు మరో ఏడుగురు శివరాత్రి స్నానానికి బుధవారం గోదావరి ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ ఇసుక మేటలు ఉన్నాయని మరింత ముందుకు వెళ్లారు. నదిలో సుమారు పది అడుగుల దూరం వెళ్లిన తర్వాత నీళ్లు బాగా నీలం రంగులో ఉన్నాయని, ముగ్గురు మరింత ముందుకు వెళ్లారు. అంతే.. అకస్మాత్తుగా నీటిలోకి జారిపోయారు. వాళ్లను రక్షిద్దామని వెళ్లిన మరో ఇద్దరు కూడా పైకి రాలేకపోయారు. దీంతో ఐదుగురూ ప్రాణాలు విడిచారు. మిగతా స్నేహితుల అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలియగానే కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిశోర్‌ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో గాలించి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. విద్యార్థులంతా ఒకే ఊరు, ఒకే వీధికి చెందిన వాళ్లు కావడంతో గ్రామం శోకంలో మునిగిపోయింది.

శ్రీశైలంలో తండ్రీకొడుకులు..

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ల గ్రామానికి చెందిన పెరుగు గురవయ్య (35), అతడి కుమారుడు వాసు (11) శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు శ్రీశైలం వెళ్లారు. బుధవారం స్నానాలు చేసేందుకు నదిలోకి దిగారు. ముందుగా కుమారుడు వాసు నీటిలోకి దిగి.. కాలు జారి కొట్టుకుపోతుండగా అతడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రి కూడా అదృశ్యమయ్యారు. మత్స్యకారులు మృతదేహాలను బయటకు తీశారు.


తమ్మిలేరులో అన్నదమ్ములు..

ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన అన్నదమ్ములు తమ్మిలేరులో స్నానానికి దిగి చనిపోయారు. లింగపాలెం మండలం తిమ్మక్కపాలేనికి చెందిన పేరిచర్ల మారేష్‌, మంగమ్మ దంపతులు, వారి కుమారులు మునియ్య, మణికుమార్‌ బంధువులతో కలిసి బలివే వచ్చారు. తమ్మిలేరులో స్నానాలు చేసి, స్వామివారి దర్శనానికి బయలు దేరారు. కుమారులిద్దరూ కొద్దిసేపు స్నానం చేసి వస్తాం... మీరు వెళ్లండని తల్లిదండ్రులకు చెప్పారు. దర్శనం పూర్తయినా.. కుమారులిద్దరూ రాకపోవడంతో వెతుక్కుంటూ తమ్మిలేరు దగ్గరకు వచ్చారు. మునిపల్లె సమీపంలో మణికుమార్‌(18) మృతదేహం కనిపించింది. మరో కుమారుడి కోసం వెతుకుతుండగా నీటిలో గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మునియ్య(20) మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది.

వైసీపీ చేసిన పాపం

తాడిపూడిలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇసుక ర్యాంపు ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడపడితే అక్కడ డ్రెడ్జింగ్‌ చేయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లోనే యువకులు మృత్యువాతపడ్డారు. ఇక్కడ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవు.

Updated Date - Feb 27 , 2025 | 03:29 AM