Share News

Weather Disruption : అకాల వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:54 AM

అకాల వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

Weather Disruption : అకాల వర్షం.. ఈదురుగాలుల బీభత్సం

  • సీమలో దెబ్బతిన్న పంటలు

  • సత్యసాయి జిల్లా గంజివారిపల్లెలో 33.25 మి.మీ. వాన

  • అనంతలో ఉద్యాన పంటలకు రూ.36.11 కోట్ల నష్టం

  • కడప జిల్లాలో 2455 ఎకరాల అరటి తోటలు నేలమట్టం

  • బెంగళూరులో విమానాల రాకపోకలకు అంతరాయం

  • రైతుల్ని ఆదుకుంటాం: చంద్రబాబు

  • పంట నష్టం అంచనా వేయండి: మంత్రి అచ్చన్న

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

అకాల వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రూ.36.11 కోట్ల విలువైన పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట కోత దశలోని అరటి, బొప్పాయితోపాటు మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా పుట్లూరు, యల్లనూరు, యాడికి, శింగనమల మండలాల్లోని 557.20 హెక్టార్లలో రూ.34.82 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. అలాగే, 2 హెక్టార్లలో రూ.7.50 లక్షల విలువైన బొప్పాయి, రూ.లక్ష విలువైన మామిడి పంట దెబ్బతిన్నాయి. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో 35 హెక్టార్లలో రూ.30.09 లక్షల విలువైన మొక్కజొన్న దెబ్బతింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 110.5 హెక్టార్లలో చేతికొచ్చిన రూ.1.20 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం రాత్రి దాదాపు గంటపాటు వీచిన ఈదురుగాలులకు వడగండ్లు కూడా తోడవడంతో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడులు వచ్చే సమయానికి పంట నేలమట్టమైదని రైతులు వాపోతున్నారు. లింగాల మండలంలో దాదాపు 2455 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. నష్ట నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో వర్షం కురవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Untitled-4 copy.jpg


శనివారం రాత్రి పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి కురిసిన వర్షం బెంగళూరులో విమానాల ల్యాండింగ్‌, టేకా్‌ఫపై ప్రభావం చూపిందని ఇండిగో సంస్థ ‘ఎక్స్‌’లో తెలిపింది. సూక్ష్మంగా గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం పంపుతామని పేర్కొంది. ప్రయాణాల్లో మార్పులు అవసరం అనుకుంటే వెబ్‌సైట్‌ ద్వారా రీబుకింగ్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఎయిరిండియా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లేముందు విమానం స్టేట్‌సను పరిశీలించాలని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. బెంగళూరులో కొన్ని రోడ్లపై వర్షం నీరు చేరి, ట్రాఫిక్‌ స్తంభించిన అంశాలను ప్రస్తావించింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో హుణసమారనహళ్ళి వద్ద రోడ్డుపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి విమానాలు యథాతథంగా రాకపోకలు సాగించాయి. వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, తగిన సూచనలు చేయాలని ఉద్యాన శాఖ అధికారులను నిర్దేశించారు.


నేడూ ఈదురుగాలులు.. వడగళ్ల వాన ముప్పు

విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో సముద్రం నుంచి భూఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటికి వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలులు కలుస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో వాతావరణంలో అనిశ్చితి నెలకొని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ గాలులు వీచాయి. శ్రీసత్యసాయి జిల్లా గంజివారిపల్లెలో 33.25 మి.మీ., అన్నమయ్య జిల్లా వలసపల్లెలో 29.75 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గింది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులుతో వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 24 , 2025 | 03:55 AM