Share News

Political Controversy: బూతుల్ని సుద్దులంటారా?

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:14 AM

హద్దులు దాటిన వారిపై చర్యలు కూడా తీసుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్‌ మాత్రం అంతా ‘రివర్స్‌’! ప్రతిపక్ష నాయకులతో పాటు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో మహిళలను ఆ పార్టీ నేతలు...

 Political Controversy: బూతుల్ని సుద్దులంటారా?

  • పోసానికి జగన్‌ మద్దతు.. ఆయన సతీమణికి ఫోన్‌

  • నాడు బాబు, పవన్‌, లోకేశ్‌పై పోసాని దారుణ దూషణలు

  • మహిళలపై హేయ వ్యాఖ్యలు.. ఖండించని జగన్‌

  • కానుకగా ఎఫ్‌డీసీ పదవి.. అరెస్ట్‌ చేయగానే గగ్గోలు

  • ఖండించని జగన్‌.. కానుకగా ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి

పోసాని బూతులు

బ్రోకర్‌, లోఫర్‌, సైకో, వెధవ, ల.. కొడకా, రాజకీయాలు వదిలేసి ఏ చావైనా చావు.. మీ అమ్మను, భార్యను కూడా తిడతా..

- నటుడు, రచయిత

పోసాని నోటి వెంట జారిన బూతుల్లో కొన్ని

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సాధారణంగా ఏ పార్టీలోనైనా ఏ కార్యకర్త/నాయకుడైనా మహిళల గురించి అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే వారిస్తారు. హద్దులు దాటిన వారిపై చర్యలు కూడా తీసుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్‌ మాత్రం అంతా ‘రివర్స్‌’! ప్రతిపక్ష నాయకులతో పాటు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో మహిళలను ఆ పార్టీ నేతలు వ్యక్తిత్వ హననం చేసేలా ఎన్ని దూషణలు చేసినా నాడు ఖండించలేదు. పైగా కానుకగా పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించారు. ఇప్పుడు వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే అక్రమమంటూ ఆక్రోశిస్తున్నారు. పచ్చి బూతులు మాట్లాడిన వారికి మద్దతు ప్రకటించారు. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన ఇంట్లోని మహిళల గురించి నాడు పోసాని అనరాని మాటలు అన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న జగన్‌ అండతో రెచ్చిపోయి, ప్రెస్‌మీట్లు పెట్టి మరీ దారుణమైన దూషణలు చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం తప్పని ఏనాడూ పోసానిని జగన్‌ మందలించలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానుకగా ఆయనకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. తాజాగా అన్నమయ్య జిల్లా పోలీసులు ఇదే కేసులో పోసానిని అరెస్ట్‌ చేయగానే, ‘నేనున్నానంటూ’ జగన్‌ ఆయనకు భరోసా ఇస్తున్నారు. పైగా ‘దేవుడు అంతా చూస్తున్నాడు’ అని నీతులు చెబుతున్నారు. విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద పదాలు వల్లె వేసే జగన్‌ దృష్టిలో.. మహిళలను నాగరిక సమాజం వినరాని బూతులు తిట్టడం నైతికతా..? అలాంటి వారిని అరెస్ట్‌ చేయడం అక్రమమా..? జగన్‌ తీరుపై మహిళలు, సాధారణ ప్రజలు, రాజకీయ విశ్లేషకులతో పాటు ఆయన పార్టీ శ్రేణులు కూడా విస్తుపోతున్నారు.


  • నోరు తెరిస్తే బూతులు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని నోరు తెరిస్తే పచ్చి బూతులే. పవన్‌తో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ గురించి పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కూర్చొని పవన్‌ కల్యాణ్‌పై అత్యంత జుగుప్సాకరంగా బూతులు మాట్లాడారు. పవన్‌ ఇంట్లో అభం శుభం ఎరుగని మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలిపేలా పోసాని మాట్లాడారు. పిల్లల పుట్టుకపైనా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు.

  • దేవుడు అంతా చూస్తున్నాడు

  • ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం

  • పోసాని భార్యకు జగన్‌ భరోసా

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన ఇంట్లో మహిళలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సినీనటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్‌ చేయడాన్ని వైసీపీ అధినేత జగన్‌ ఖండించారు. ‘దేవుడు అంతా చూస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. మేం అందరం తోడుగా ఉంటాం’ అని పోసాని భార్య కుసుమలతకు ధైర్యం చెప్పారు. గురువారం జగన్‌ ఆమెకు ఫోన్‌ చేసి పరామర్శించారు. అడ్వకేట్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి తదితరులను రాజంపేటకు పంపించామని, నాయకులు కోర్టు వద్దకు వస్తారని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదన్నారు

Updated Date - Feb 28 , 2025 | 05:17 AM