Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి పాటిస్తే మైండ్ షార్ప్ అవడం పక్కా..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:41 PM
Memory Boosting Exercises: ఏ పనిపైనా సరిగా ఏకాగ్రత కుదరడం లేదా ? చిన్న చిన్న విషయాలనే గుర్తుపెట్టుకోలేక సతమవుతున్నారా ? అయితే, పరిస్థితులు చేయి దాటిపోకముందే అలర్ట్ అవండి. ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేసి మెదడుకు పదును పెట్టండి.

Memory Boosting Exercises: బాగా తెలిసిన వ్యక్తే ఎదురుపడగానే పేరు చెప్పలేకపోతారు.. కచ్చితంగా చేయాలని అనుకున్న పని హఠాత్తుగా ఎంత ఆలోచించినా గుర్తురాదు..ఏ వస్తువు ఎక్కడ పెట్టామో తెలీక కంగారు పడిపోతారు.. చిన్న చిన్న విషయాలనే జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా కష్టపడతారు.. ఇలాంటి లక్షణాలే మీలోనూ కనిపిస్తున్నాయా.. నిజానికి మర్చిపోవడం అనేది పెద్ద సమస్య కాదు. అందరూ ఎప్పుడోకప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ, మర్చిపోవడం అనేది అలవాటుగా మారితేనే డేంజర్. అందుకే సమస్య మరింత ముదిరిపోకముందే మీ మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టండి.
ఆరోగ్యంగా ఉండటానికి పోషకమైన ఆహారంతో పాటు, మంచి వ్యాయామం కూడా అవసరం. ప్రజలు తరచుగా శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతారు కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 3 వ్యాయామాలను మీ దినచర్యలో చేర్చుకోండి. అప్పుడు ఆటోమేటిగ్గా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు రాటుదేలతాయి.
ధ్యానం
యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తాయి. వృక్షాసనం లేదా వీరభద్రాసనం వేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం కొంత సమయం ధ్యానం, యోగా సాధన చేయండి.
మెమరీ గేమ్స్
మీరు మీ జ్ఞాపకశక్తిని పదును పెట్టుకోవాలనుకుంటే మెమరీ గేమ్స్ ఆడండి. ఈ ఆటలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీకు మెదడుకు పని పడుతుంది. రిలాక్సేషన్ భావనతో పాటు ఉత్సాహం వస్తుంది. పజిల్ గేమ్స్, క్రాస్‌వర్డ్ పజిల్స్, చెస్ ఆటలు జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో సహాయపడతాయి.
ప్రతిదీ నోట్‌బుక్‌లో రాయండి
మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ మనసులోని విషయాలను పుస్తకంలో రాస్తే అది ఎప్పటికీ గుర్తుంటుంది.ఇది అనాదిగా వస్తున్న టెక్నిక్. ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుంచుకోవాలనుకుంటే దానిని డైరీలో రాసుకోండి. అప్పుడు మీ మెదడు ఆ విషయాన్ని గుర్తుచేస్తుంది. మీరు మొబైల్ ఫోన్‌లో కూడా నోట్స్ రాసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆహారం మన మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఆకుపచ్చని కూరగాయలు, బాదం, వాల్‌నట్స్, చేపలు మెదడుకు మేలు చేస్తాయి. దీనితో పాటు తగిన మోతాదులో నీరు తీసుకుంటూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
మైండ్‌ఫుల్ బ్రీతింగ్
శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ పద్ధతుల వల్ల మీరు విషయాలను గుర్తుంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ వ్యాయామాలు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు చేయాలి.
మెదడుకు సవాలు విసరండి
మెదడుకు తగినంత పని చెప్పకపోతే ఇనుముకు తుప్పు పట్టినట్టే మెదడు పనితీరు మసకబారుతుంది. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తే మెదడు ఉత్తేజితమవుతుంది.
కంటి వ్యాయామాలు
తలను తిప్పకుండా మీ కళ్ళను ఎడమ నుంచి కుడికి, పైకి క్రిందికి కదిలించండి. తర్వాత కళ్ళను గుండ్రంగా కదిలించడానికి ప్రయత్నించండి. ఈ తేలికపాటి వ్యాయామం 2 నిమిషాలు చేస్తే కంటి కండరాలను బలోపేతం అయ్యి స్క్రీన్ అలసట తగ్గుతుంది. విజువల్ మెమరీని మెరుగుపడుతుంది.
స్ట్రెచింగ్
ప్రతిరోజూ కొద్దిసేపు శరీరాన్ని స్ట్రెచ్ చేస్తే మొత్తం శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడుతో సహా శరీరంలోని అన్ని భాగాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇది వ్యక్తి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్ట్రెచింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.
Read Also : Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..
Raw Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..