Health Tips : మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:05 AM
ఉండేది పిడికెడే అయినా మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ప్రధానమైనది మూత్రపిండం. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాంటి కిడ్నీలు ఒక్కసారి దెబ్బతింటే ఏ చికిత్స చేసుకున్నా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేవు. అందుకే, ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దు..
ఉండేది పిడికెడే అయినా మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ప్రధానమైనది మూత్రపిండం. జీవక్రియల్లో భాగంగా శరీరంలో పుట్టుకొచ్చిన వ్యర్థాలను తొలగించడం, రక్తాన్ని వడపోయడం, శరీర ద్రవాల మోతాదులను నియంత్రించడం, రెనిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి రక్తపోటును అదుపు చేయడం లాంటి ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడే విటమిన్ డి తయారీలోనూ కిడ్నీలదే కీలక పాత్ర. శరీరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ అన్ని అవయవాలు సజావుగా, సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మన కోసం విరామం లేకుండా కష్టపడే కిడ్నీలను సంరక్షించుకోవడంలో అలసత్వం చూపిస్తే అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ఒక్కసారి కిడ్నీలు దెబ్బతింటే ఏ చికిత్స చేసుకున్నా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేవు. సమస్య తీవ్రం అయితే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడే శరణ్యం అవుతుంది. నిజానికి, ప్రారంభ దశలో కిడ్నీ జబ్బు రాబోతోందని చెప్పే లక్షణాలేవి ముందుగా మనకు కనిపించవు. అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ, ఈ సంకేతాలు గుర్తించగలిగితే కిడ్నీలను కాపాడుకునేందుకు వీలు కలుగుతుంది.
కిడ్నీ జబ్బు ప్రారంభ సంకేతాలు :
కిడ్నీల సామర్థ్యం మందగిస్తోందని చెప్పే గుర్తులేవి మొదట్లో పెద్దగా కనిపించవు. నెఫ్రాన్లు దెబ్బతింటున్న ప్రారంభ దశలో ఏమీ తెలియదు. పనితీరు చాలా నెమ్మదిగా తగ్గుతూ వచ్చి ఒక్కసారిగా ఎక్కువ అవుతుంది. అప్పటికే దేహంలో వ్యర్థాలన్నీ చెత్త కుప్పలా పోగుపడతాయి. కానీ, ఈ సాధారణ సంకేతాలు గమనించడం ద్వారా కిడ్నీ జబ్బు లక్షణాలు ముందే పసిగట్టవచ్చు. మూత్రపిండాల పనే రక్తం నుంచి వ్యర్థాలను వేరు చేసి శరీరం బయటకు పంపించడం. కాబట్టి, మూత్రవిసర్జన పరిమాణం(ఎక్కువ లేదా తక్కువ)లో, రంగు(ముదురు రంగు, నురుగు లేదా రక్తం)లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దానిపై ఒక కన్నేసి ఉంచాలి.
ఈ కింది లక్షణాలు కిడ్నీ జబ్బు ముదురుతోంది అనేందుకు సూచనలు. ఇవి గుర్తిస్తే జబ్బు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
ఆకలి : రక్తంలో విషపూరిత పదార్థాలు పెరిగిపోతే ఆకలి వేయదు. తిన్నా వికారంగా అనిపించడం, వాంతులు వంటి లక్షణాలుంటాయి. బరువు తగ్గడం, తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం వంటివి కనిపిస్తాయి. సమస్య తీవ్రమైతే మూర్ఛ కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలే ఇతర జబ్బుల్లోనూ కనిపించే అవకాశముంది కాబట్టి చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తే ప్రమాదం.
నీరసం, నిస్సత్తువ : కిడ్నీ పనితీరు సరిగా లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్రరక్తకణాల సంఖ్య పడిపోయి శరీరంలోని కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో నీరసం, నిస్సత్తువ ఏర్పడి చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుంది.
మూత్రంలో మార్పులు : మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించడం, రంగు, పరిమాణంలో మార్పులు గమనించాలి.
దురద, చర్మం పొడిబారటం: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే చర్మం పొడిబారుతుంది. దురద, చికాకు వస్తుంది. క్యాల్షియం, ఫాస్పేట్ వంటి ఖనిజాల సమతుల్యత కొరవడటమే ఇందుకు కారణం.
ఉబ్బు: శరీరంలో ఉత్పత్తి అయ్యే ద్రవాలను కిడ్నీలు బయటికి పంపలేకపోతే అవి శరీరంలో ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతాయి. ముఖ్యంగా మడమలు, కాళ్లు, పాదాల చుట్టూ చేరి ఉబ్బులాగా కనిపిస్తాయి. కండరాల నొప్పి, తిమ్మిరి వంటి కిడ్నీ జబ్బులు వచ్చే ముందు కనిపించే సూచనలు.
జబ్బు ముదిరితే : ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. నిద్రపోవడం కష్టమవుతుంది. ఛాతీనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం, గుండెదడగా అనిపించడం, గందరగోళం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
కారణాలు : కిడ్నీ జబ్బుకు కారణాలు అనేకం. మధుమేహం రోగులను త్వరగా కిడ్నీ వ్యాధులు కబళిస్తాయి. అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఒంట్లో మలినాలు పేరుకుపోయినా, ఆలస్యంగా భోజనం చేసి సరిగా నిద్రపోకపోయినా కిడ్నీలు రాళ్లు ఏర్పడతాయి. నీళ్లు, తక్కువగా తాగి, మాంసాహారమూ ఎక్కువగా తిన్నా అపాయమే. కొన్ని రకాల మందుల వల్ల కిడ్నీ జబ్బులు వస్తాయి. వంశపారంపర్యంగానూ ఈ జబ్బులు వచ్చేందుకు ఆస్కారముంది.
కిడ్నీల సంరక్షణకు చిట్కాలు :
కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, తక్కువ కొవ్వు ప్రోటీన్లతో కూడిన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఉప్పు, ప్రోటీన్ , పొటాషియం తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహం నియంత్రణపై దృష్టి పెట్టాలి. కిడ్నీ జబ్బు లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.