Canada : కెనడా అమ్మకానికి లేదు.. ట్రంప్‌కు ప్రతిపక్ష నేత జగ్మీత్ సింగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:19 PM
తమ దేశంలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలంటూ ఇటీవల పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు.. కెనడా ప్రతిపక్షనేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భూ విస్తరణ కాంక్షను వ్యక్తం చేస్తూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు ట్రంప్. కెనడా 51వ రాష్ట్రంగా తమ దేశంలో చేరాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. సరిహద్దు భద్రతను మెరుగుపరచకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలను విధిస్తానని పొరుగు దేశాలను హెచ్చరిస్తూ వరస ట్వీట్‌లు పోస్ట్ చేస్తున్నారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయకపోతే అధికారం చేపట్టగానే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమెరికాలో విలీనం కావాలని మెజారిటీ కెనడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలకు మెక్సికో, ఐరోపా దేశాల నాయకులు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలోకి కెనడా విలీనాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కెనడా ప్రతిపక్షనేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత, ఖలిస్థానీ మద్ధతుదారు జగ్మీత్ సింగ్ ట్రంప్ కెనడా విలీన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు'నేను డొనాల్డ్ ట్రంప్‍కు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ. ఈ దేశంలో ఉన్నందుకు కెనడియన్లు ఎంతో గర్విస్తారు. ఒకవేళ ట్రంప్ మా దేశంతో యుద్ధం చేయాలని భావిస్తే అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశాన్ని రక్షించుకునేందుకు ఇక్కడి ప్రజలు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని.' హెచ్చరించారు.
వచ్చే వారం (జనవరి 20న) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్, ఇటీవలే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో భద్రత పెంచి అక్రమ వలసలు నిలువరించకపోతే కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తూనే.. కెనడా ప్రధానిని 'గవర్నర్' అని సంబోధిస్తూ ఎద్దేవా చేశారు. తర్వాత కూడా కెనడా దిగుమతులపై 25% సుంకాలను విధిస్తానని ఒట్టావాను మాటిమాటికీ హెచ్చరిస్తూ వస్తున్నారు. దీనిపై కెనడా ప్రతిపక్షనేత జగ్మీత్ సింగ్ బదులిస్తూ 'ఇందుకు ప్రతీకారంగా తామూ అదే రీతిలో అమెరికాపై సుంకాలు విధిస్తామని' ఎక్స్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా కెనడా ప్రతిపక్షనేత, ఎంపీ జగ్మీత్ సింగ్ ట్రంప్‌కు కౌంటరిచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కంటే ఇంటర్‌నెట్‌లో ట్రోలర్‌గానే ఎక్కువ ఫేమస్ అవుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.