International : లాస్ ఏంజెలెస్‌లో.. దగ్ధమైన బైడెన్ కుమారుడి ఇల్లు
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:28 PM
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు.. దావానంలా వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమారుడి ఇల్లు కాలి బూడిదయ్యింది.
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు.. దావానంలా వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. ప్రముఖులు, హాలీవుడ్ నటులు ఎక్కువగా నివసించే పసిఫిక్ సాలేడ్స్, హాలివుడ్ హిల్స్‌ను ప్రాంతాలను చుట్టుముట్టిన మంటలు.. అక్కడి విలాసవంతమైన భవనాలకు బూడిద చేశాయి. బలంగా గాలులు వీస్తుండటంతో పెద్ద ఎత్తున ఎగసిపడుతూ వేగంగా వ్యాప్తి చెందుతున్న అగ్నికీలలు లాస్ ఏంజెలెస్‌లోని చుట్టపట్ల ప్రాంతాలకూ విస్తరించాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమారుడి ఇంటిని కాలి బూడిద చేశాయి. అంతర్జాతీయ మీడియా ప్రకారం, మాలిబులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇది నిజమని నిర్ధారిస్తూ బూడిదగా మారిన హంటర్ బైడెన్ ఇల్లు, ఇంటి ముందు కాలిపోయిన కారు ఫొటోలను రష్యన్ టెలివిజన్ షేర్ చేసింది.
పసిఫిక్ సముద్రానికి సమీపంలో మాలిబూలో ఉన్న హంటర్ బైడన్ ఇంటిని 1950లలో నిర్మించారు. కార్చిచ్చుకు ఆహుతైన ఈ లగ్జరీ హౌస్‌లో మూడు విశాలమైన పడక గదులు, మూడు స్నానపు గదులు, ప్రైవేటు బాల్కనీ, స్టూడియో ఉన్నాయి. ఈ విషయమై జో బైడెన్ విలేకరుల సమావేశంలో స్పందించారు. మంటల్లో చిక్కుకుని కుమారుడి ఆస్తి ధ్వంసమైన ఘటనపై తనకు కచ్చితమైన సమాచారమేది అందలేదని వెల్లడించారు.
లాస్‌ఏంజెలెస్ నగరంలో చెలరేగిన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అధికారులు. 1700లకు పైగా అత్యవసర సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూ మంటలు ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆస్తి నష్టాన్ని నివారించేందుకు మరింతమందిని సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కార్చిచ్చు చెలరేగడం వల్ల సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 వేలకుపైగా ఇళ్లు తగలబడిపోయాయి. ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇప్పటికే హాలీవుడ్ హిల్స్‌కు వ్యాపించడంతో అక్కడ నివసించే హాలీవుడ్ నటులు, ప్రముఖులు సహా వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇంకా లక్షలాది మంది ప్రజలను రక్షిత ప్రాంతాలకు చేర్చాల్సి వస్తుందని అంచనా.