Heart Attack: గుండెపోటుతో కుప్పకూలిన చిన్నారి.. షాకింగ్ వీడియో..
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:16 AM
Heart Attack: అహ్మదాబాద్‌లో ఓ చిన్నారి తీవ్ర గుండెపోటుతో పాఠశాలలో కుప్పకూలిపోయింది. ఈ చిన్నారి హార్ట్ ఎటాక్‌తో ఇబ్బంది పడుతున్న షాకింగ్ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు.
గుండెనొప్పి సమస్యతో ఈమధ్య తరచూగా చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారని వింటూనే ఉన్నాం. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా హార్ట్ ఎటాక్‌తో మృతిచెందుతున్నారు. చిన్న వయస్సులో ఇలా చనిపోవడం వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. తాజాగా అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి తీవ్ర గుండె నొప్పిరావడంతో తాను చదువుకుంటున్న పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళ్తే... అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ పాఠశాలలో చదవుతున్న ఎనిమిదేళ్ల గార్గి అనే బాలిక మృతిచెందింది. ఈ పాప ఇప్పుడు మూడో తరగతి చదువుతోంది.
రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన పాపకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. గార్గి పాఠశాలకు వెళ్లిన కాసేపటికే విపరీతమైన గుండె నొప్పి రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. పాప కిందపడి పోతుండటాన్ని చూసి పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే అక్కడికి వచ్చారు. ఆ చిన్నారికి ఏం అయిదోనని చూస్తున్నంతలోపే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాప బాధను చూసిన టీచర్లు వెంటనే స్థానిక జైడస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లగానే పాపకు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అందుతుండగానే పాప మృతిచెందిందని వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తన తోటి చిన్నారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గార్గి అస్వస్థతకు గురవడాన్ని సీసీటీవీ ఫుటేజీలో చూశామని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శర్మిష్ట సిన్హా తెలిపారు. ఇందుకు సంబంధించి వైద్యులు రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టులో హార్ట్ ఎటాక్‌తోనే మృతిచెందినట్లు తేలింది. చిన్నారికి ఎలాంటి సాధారణ వ్యాధులకు మించిన ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు. ముంబైకు చెందిన గార్గి అహ్మదాబాద్‌లో తన తాతయ్యలతో కలిసి నివసిస్తోంది. పాప మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. గార్గి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. చిన్నారి హార్ట్ ఎటాక్‌తో బాధపడుతున్న వీడియోను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.