BPSC Exam Row: ప్రశాంత్ కిషోర్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:16 PM
కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్‌ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
పాట్నా: జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore)కు పాట్నా సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీనికి ముందు కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ ష్యూరిటీ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై పీకీ చేపట్టిన నిరాహార దీక్షను పాట్నా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనందున అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
BPSC Exam Row: బెయిలు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్.. జైలులోనే దీక్ష
అందుకే బెయిల్ ఆర్టర్‌ను నిరాకరించా: పీకే
కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్‌ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ''ఉదయం 5 నుంచి 11 గంటల వరకూ నన్ను పోలీసు వ్యానులోనే ఉంచి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు. పదేపదే అడిగినప్పటికీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పలేదు. ఫత్వా కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకువెళ్లారు. వైద్యపరీక్షలు చేయించి వైద్యుల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలని అనుకున్నారు. నేనేమీ నేరపూరిత చర్యలకు పాల్పడలేదు. అందుకే వైద్య పరీక్షలకు నిరాకరించాను. ఈ విషయాన్నే డాక్టర్లకు చెప్పాను. వైద్యులకు పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే చట్టవిరుద్ధమైన సర్టిఫికెట్ ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించారు. మెడికల్ టెస్టుకు నిరాకరించడంతో నా స్టేట్‌మెంట్‌ను వాళ్లు రికార్డు చేసుకున్నారు'' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు
దీనికి ముందు, గాంధీమైదాన్‌లో సోమవారం ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ప్రశాంత్ కిషోర్‌ను పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. ఆంక్షలున్న ప్రదేశంలో ప్రదర్శనలకు అనుమతి లేనందునే కిషోర్‌ను, ఆయన మద్దతుదారులను దీక్షా స్థలి నుంచి తరలించినట్టు పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్‌సీ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌పై జనవరి 2 నుంచి జన్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కిషోర్ దీక్షా శిబిరం నుంచి తొలగించేటప్పుడు ఆయనపై చేయి చేసుకున్నారని, కొట్టారని ఆయన మద్దతుదారులు చేసిన ఆరోపణను జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తోసిపుచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనపై చేయి చేసుకోలేదని, ఆయనను అరెస్టు చేయకుండా అడ్డుపడిన మద్దతుదారులను నిరసన స్థలి నుంచి ఖాళీ చేయించారని చెప్పారు. ఈ సందర్భంగా 43 మంది మద్దతుదారులను అరెస్టు చేసి మూడు ట్రాక్టర్లతో సహా 15 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. బీపీఎస్‌సీ పరీక్షల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందుందని, ఎవరైనా తమ వాదనలు చెప్పుకోవాలని అనుకుంటే అత్యు్న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..
Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు
Read More National News and Latest Telugu News