Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:35 AM
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్‌టీ అదనపు కమిషనర్‌గా జార్ఖండ్‌కు చెందిన మనీశ్ విజయ్ పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మనీశ్ సెలవు తీసుకున్నారు. అయితే సెలవు ముగిసినా అతను కార్యాలయానికి రాలేదు, ఫోన్ చేసినా సమాధానం లేదు.

కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్‌టీ అదనపు కమిషనర్ మనీశ్ విజయ్ కుటుంబం సామూహిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడడం కేరళలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం ఏమాత్రం తెలియడం లేదు. మనీశ్ కుటుంబం సూసైడ్‍కు గల కారణాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. అసలేం జరిగిందో అంతుపట్టక కేరళ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్‌టీ అదనపు కమిషనర్‌గా జార్ఖండ్‌కు చెందిన మనీశ్ విజయ్ పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మనీశ్ సెలవు తీసుకున్నారు. అయితే సెలవు ముగిసినా అతను కార్యాలయానికి రాలేదు, ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో అనుమానం వచ్చిన తోటి అధికారులు అసలేం జరిగిందో తెలుకునేందుకు మనీశ్ ఉంటున్న కక్కనాడ్ కస్టమ్స్ క్వార్టర్స్‌కు వెళ్లారు. వారి ఇంటి తలుపు తీసే ప్రయత్నం చేయగా.. భరించలేని దుర్గంధం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇంటి తలపులు బద్దలుకొట్టారు ఖాకీలు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు.
మనీశ్ ఇంట్లోకి వెళ్లిన అధికారులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. మనీశ్ అతని సోదరి షాలిని వేర్వేరు గదుల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. వారి తల్లి శంకుతల మృతదేహం సైతం మంచంపై పడి ఉంది. ఆమె పక్కన తెల్లటి గుడ్డ, పూలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా శంకుతల చనిపోయి ఉంటుందని, ఆ తర్వాతే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య వెల్లడించారు. వారి చనిపోయి కొన్ని రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయినట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్ష తర్వాతే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. మరోవైపు తనిఖీల్లో సూసైడ్ నోట్‌ను గుర్తించామని, విదేశాల్లో ఉంటున్న తమ సోదరికి మరణవార్త తెలియజేయాలని లేఖలో రాశారని కమిషనర్ వెల్లడించారు.
మనీశ్ విజయ్ గతంలో కోజికోడ్ విమానాశ్రయంలో కస్టమ్స్ ప్రివెంటివ్‌లో పనిచేశాడు. ఆ తర్వాత ఏడాదిన్నర క్రితం కొచ్చికి బదిలీ అయ్యాడు. అయితే కొన్ని నెలలుగా అతనితోపాటే తల్లి, సోదరి కూడా ఉంటున్నారు. పోలీసుల వివరాల ప్రకారం షాలిని జార్ఖండ్‌లో ఓ కేసు ఎదుర్కొంటోంది. దాని కోసమే మనీశ్ సెలవు తీసుకున్నాడు. 2006లో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో షాలిని మొదటిస్థానంలో నిలిచారు. డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే, ఆ తర్వాత ఆమె ర్యాంకును అధికారులు రద్దు చేశారు. షాలిని నియామకాన్ని తొలగించారు. దీనిపై సీబీఐ విచారణ సైతం జరుగుతోంది. వారి ఆత్మహత్యకు ఇదే కారణమా? ఇంకేదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Actor Vijay: నెల తిరక్కమునుపే జిల్లా నేతలపై చర్యలు..
Chennai: హిందీని వ్యతిరేకిస్తూ తమిళనాడు అంతటా పోస్టర్లు..