Share News

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..

ABN , Publish Date - Jan 24 , 2025 | 02:08 PM

ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..
Kejriwal on Yogi Delhi Law And Order Comments

అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. జనక్‌పురి బహిరంగ సభలో ప్రసగించారు. ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, అక్రమ వలసల గురించి కేజ్రీవాల్‌పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో యూపీ సీఎం యోగివ్యాఖ్యలను ఖండిస్తూ ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ శాంతిభద్రతలను బాగు చేయాలా? అని మండిపడ్డారు..


పంజాబ్ పోలీసులు తన భద్రతను తొలగించడం పూర్తిగా రాజకీయమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. "ఒకరి వ్యక్తిగత భద్రత రాజకీయాల చేతుల్లో పెట్టబడినందుకు నేను చింతిస్తున్నాను" అని చెప్పారు. ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలకు ఆప్ ఛీఫ్ కేజ్రీవాల్ అంతే స్థాయిలో బదులిచ్చారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “యోగీ జీ ఈరోజు ఢిల్లీకి వచ్చారు. ఆయన దేశరాజధానిలో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. యూపీలో శాంతిభద్రతలను తానే బాగుచేశానని అన్నారు. అయితే, ఢిల్లీ శాంతిభద్రతలపై నేను యోగి జీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే, దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. 11 మంది గ్యాంగ్‌స్టర్లు మొత్తం ఢిల్లీని స్వాధీనం చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నారని“ అన్నారు. శాంతిభద్రతలు, అక్రమ వలసదారులు తదితర అంశాలపై సీఎం యోగి ఆప్ పాలనపై విరుచుకుపడిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


గురువారం జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడుతూ, "2020లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో బంగ్లాదేశీ చొరబాటుదారుల సహాయంతో అల్లర్లను ప్రేరేపించిందని ఆరోపించారు. ఆప్ కౌన్సిలర్లు మరియు అధికారులు కలిసి 2020లో షాహీన్ బాగ్‌లో గందరగోళం పరిస్థితులు, గుండాయిజం సృష్టించారు. మీరు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే ఇలాంటివి ఉండవన్నారు. కాబట్టి, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తే ఢిల్లీని ఇంద్రప్రస్థంగా మార్చే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు".


ఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీని డంపింగ్ యార్డులా మార్చిందని, 24 గంటల విద్యుత్ అందించడంలేదని కూడా యూపీ సీఎం యోగీ ఆరోపించారు. ఈ విమర్శలకు ఢిల్లీ హరినగర్ ప్రచార సభలో బదులిచ్చారు ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. "పదేళ్ల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉంది కదా ! యోగి జీని నేను ఒకట అడుగుతున్నా. యూపీ ఎన్ని గంటలు కరెంటు కోతలు ఉంటాయో చెప్పండి." అని ప్రశ్నించారు. ఆప్ పాలనలో ఢిల్లీలో గత ఐదేళ్లుగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు."

Updated Date - Jan 24 , 2025 | 02:08 PM