PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:57 PM
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాాతాల్లో నగదు రేపు అంటే.. సోమవారం (ఫిబ్రవరి 24వ తేదీ)న పడనున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.

రైతులకు పెట్టబడి సాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులోభాగంగా 19వ విడత నిధులు విడుదలకు తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు అంటే.. ఫిబ్రవరి 24వ తేదీన రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాల్సి ఉంది. అలాగే, ఇ-కేవైసీ సైతం చేసి ఉండాల్సి ఉంటుంది.
మరోవైపు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకొన్నా.. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలనుకొన్న తొలుత https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. గత విడుత అంటే..18వ విడత, 2023, అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని వాషిమ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే. ఈ విడతలో దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నగదును జమ చేశారు.
రైతులకు పెట్టబడి, ఆర్థిక సాయంతోపాటు వారి జీవనోపాధిని మెరుగు పరచడమే లక్ష్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం ఏడాదిలో మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తుంది. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు.
పీఎం కిసాన్ లబ్ధిదారులు వారి జాబితాను ఎలా చూసుకోవాలంటే..
రైతులు తమ గ్రామం, జిల్లా, రాష్ట్రం ఆధారంగా PM-KISAN యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఈ కింది విధంగా వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా PM-KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
ఆ తర్వాత నో యూవర్ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది.
జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు