Delhi Result: కొద్దిగంటల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. కేకే సర్వే ఏం చెప్పబోతుంది
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:38 PM
ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించబోతున్నాయి. ఈ సంస్థల అంచనా ఎలా ఉండబోతుంది.. కేకే సర్వే ఎలాంటి అంచనాలు ఇవ్వబోతుంది..

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 70 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుండగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. ఢిల్లీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనే ఉత్కంఠకు తెరపడాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. 8వ తేదీన ఓట్ల లెక్కింపుతో అసలు ఫలితాలు వెలువడతాయి. అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. ఢిల్లీలో ఇవాళ పోలింగ్ పూర్తైన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. జాతీయ స్థాయిలో అనేక సంస్థలు తమ అంచనాలను విడుదల చేయనున్న క్రమంలో కొన్ని సంస్థల సర్వేలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు.. మహారాష్ట్ర ఫలితాలను సరిగ్గా అంచనావేసిన కేకే సర్వే ఢిల్లీ ఫలితాలపై ఎలాంటి అంచనాలను వెల్లడించబోతున్నారనేది ఆసక్తి నెలకొంది.
ఢిల్లీలో ఎవరి అంచనాలు వారివే..
ఇప్పటివరకు ఎన్నో సంస్థలు ఒపీనియన్ పోల్స్ వెల్లడించినా కచ్చితంగా ఢిల్లీలో జెండా ఎగరవేసేది ఎవరో చెప్పలేదు. బీజేపీ, ఆప్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఎవరికి వచ్చినా 40కి పైగా సీట్లు రావని అంచనా వేశాయి. కొన్ని సంస్థలు బీజేపీ మెజార్టీ సాధిస్తుందంటే, ఆప్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందునుంచే బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీ కనిపించింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ శాసనసభలో అధికారం కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ప్రధాని మోదీ నేరుగా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ ప్రచారం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తోంది. ఈ పార్టీ చీల్చే ఓట్లు ఎవరి విజయవకాశాలను దెబ్బతీస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఒంటరిగా వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ సైతం ఒంటరి పోరుకు సై అంది. తాము గెలవకపోయినా పర్వాలేదు.. ఆప్ మాత్రం ఓడిపోవాలనే లక్ష్యంతో హస్తం పార్టీ పనిచేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు ఎలాంటి అంచనాలు ప్రకటించబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది.
కేకే సర్వేపై..
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ సర్వే సంస్థ అంచనా వేయని విధంగా కేకే సంస్థ తమ అంచనాలను ప్రకటించింది. అసలు ఫలితాలు కేకే సర్వేను ప్రతిబింబించడంతో ఆయన సర్వేపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇటీవల మహారాష్ట్రలోనూ కేకే సర్వే సరైన అంచనాలను వేయడంతో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆ సంస్థ ఇవ్వబోయే ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here