Sankranti : సంక్రాంతి వస్తోంది.. చైనా మాంజాలతో జాగ్రత్త..
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:31 PM
చాలామంది సంక్రాంతికి బంధువులు, స్నేహితులతో కలిసి పతంగులు ఎప్పుడెప్పుడూ ఎగరేద్దామా అని తప్పక ఎదురుచూస్తుంటారు. పిల్లలకైతే ఇది మరీ ప్రత్యేకం. అయితే, సంక్రాంతికి ముందే చైనా మాంజా మెడ మీద కత్తిలా వేలాడుతోందనే విషయం అందరూ గమనించి తీరాలి. ఇప్పటికే ఎందరో చైనా మాంజా ఎఫెక్ట్‌తో ప్రాణాలు కోల్పోయారు..
సెలవులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైపోయింది. అంతా సొంతూళ్లకు వెళ్లేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. అందరూ ఊళ్లో అడుగుపెట్టగానే సంక్రాంతికి మూడు రోజులూ ఏమేం చేయాలా అని ఆలోచిస్తుంటారు. వీరిలో చాలామంది బంధువులు, స్నేహితులతో కలిసి పతంగులు ఎప్పుడెప్పుడూ ఎగరేద్దామా అని తప్పక ఎదురుచూస్తుంటారు. పిల్లలకైతే ఇది మరీ ప్రత్యేకం. సంక్రాంతి సంబరాల్లో అన్ని వయసుల వాళ్లకీ నచ్చేది గాలిపటాలు ఎగిరేయడం ఒక్కటే అని చెప్పినా అతిశయోక్తి కాదు. అయితే, సంక్రాంతికి ముందే చైనా మాంజా మెడ మీద కత్తిలా వేలాడుతోందనే విషయం అందరూ గమనించి తీరాలి. సింథటిక్, నైలాన్ తదితర పదార్థాలతో తయారైన చైనా మాంజా అంత త్వరగా తెగదు. ఇది పదునుగా ఉండటం వల్ల గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికే ఎందరో చైనా మాంజా ఎఫెక్ట్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటి అమ్మకాలు, వాడకాలు నిషేధం విధించింది ప్రభుత్వం. అయినా, కొందరు ప్రాణాంతకమని తెలిసీ మర్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కాబట్టి, మనుషుల, మూగజీవాల ప్రాణాలతో పాటు పర్యావరణానికి హాని కలిగించే చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది..
ఈ మధ్య చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రిపాలైనవారు ఎందరో. నైలాన్, సింథటిక్ దారానికి గాజు ముక్కలు, విషపూరితమైన రసాయనాలు, ప్లాస్టిక్ పొడి కలిపి ఈ మాంజా తయారుచేస్తారు. అందుకే ఇది శరీరంలో ఎక్కడ తాకినా పదునైన కత్తిలాగా గాయపరుస్తుంది. పొరపాటున మెడకు చుట్టుకుందంటే ఉరితాడులా బిగుసుకుని ప్రాణాలు తీస్తోంది. తెగిపోయిన గాలిపటాల దారాలు కొన్నిసార్లు విద్యుత్ తీగలు, చెట్లపైన వేలాడుతుంటాయి. వీటిపై వాలిన పాపానికి లెక్కలేనన్ని పక్షులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేలాడే మాంజాల వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్‌పై వెళ్లేవారు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. పర్యావరణానికీ ఉచ్చు బిగుస్తూ ఊపిరి తీస్తుండటంతో.. చైనా మాంజా నిల్వ, ఉత్పత్తి, వాడకంపై 2017లోనే నిషేధం విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్.
చైనా మాంజా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నా డబ్బుపై ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు వ్యాపారులు. సంక్రాంతికి ఈ దందా ఇంకా జోరుగా సాగుతోంది. అక్రమంగా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మరీ అమాయకులకు అంటగడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా చైనా మాంజా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాపారులు చెలరేగిపోతున్నారు. కాబట్టి, సంక్రాంతిని సంతోషంగా ముగించాలంటే గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చైనా మాంజాకు దూరంగా ఉండండి. మాంజా కొనేటప్పుడు జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయండి.