Share News

Sankranti : సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేటప్పుడు.. ఈ పొరపాట్లు చేయకండి..

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:10 PM

సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, సంప్రదాయాలకు పర్యాయపదం. ముగ్గులు, కోడిపందేలు, భోగిమంటలు, పిండివంటలు ఇలా ఎన్నున్నా.. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది పతంగులు ఎగరేయడం. ఈ విషయంలో పెద్దలూ చిన్నపిల్లలుగా మారిపోయి గాలిపటాలు ఎగరేసేందుకు ఎగబడతారు. అంతా కలిసి ఆకాశాన్ని రంగుల హరివిల్లులా మార్చేస్తారు. అయితే, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సరదా కాస్త విషాదంగా మారే ప్రమాదముంది. కాబట్టి, పతంగులు ఎగిరేసేటప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి..

Sankranti : సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేటప్పుడు.. ఈ పొరపాట్లు చేయకండి..
Safety Tips While Flying Kites

సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, సంప్రదాయాలకు పర్యాయపదం. రైతులకు ఎంతో ముఖ్యమైన ఈ పండగ అంటే ఏ వయసు వారికైనా ఇష్టమే. అందుకే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే వచ్చే ఈ మూడు రోజుల పండగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు తెలుగువారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వలస జీవులంతా సొంతూళ్లకు పయనవుతారు. భోగి, సంక్రాంతి, కనుమ ఒక్కో రోజు ఒక్కోలా ఆనందాత్సాహాలతో గడుపుతారు. చిన్నా పెద్దా అందరూ కలిసి తెలుగు లోగిళ్లను సందడిగా మార్చేస్తారు. అబ్బాయిలు భోగిమంటలు, కోడిపందేలు అంటూ బిజీగా గడిపేస్తే.. అమ్మాయిలు నేలంతా రంగురంగుల ముగ్గులతో కప్పేసి కనువిందు చేస్తారు. రకరకాల పిండివంటలు, విందు భోజనాలు, ఆటలపోటీలు, హరిదాసులు, డూడూ బసవన్నలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది పతంగులు ఎగరేయడం. ఈ విషయంలో పెద్దలూ చిన్నపిల్లలుగా మారిపోయి గాలిపటాలు ఎగరేసేందుకు ఎగబడతారు. అంతా కలిసి ఆకాశాన్ని రంగుల హరివిల్లులా మార్చేస్తారు. అయితే, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సరదా కాస్త విషాదంగా మారే ప్రమాదముంది. కాబట్టి, పతంగులు ఎగిరేసేటప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి..


గాలిపటాలు ఎందుకు ఎగిరేస్తారంటే..

సంక్రాంతి పండగప్పుడు ఎక్కడచూసినా పిల్లలు, పెద్దలూ కలిసి ‘గాలిపటమా పద పద పద’ అంటూ పతంగులు ఎగురవేస్తూ నింగికి కొత్త రంగులు అద్దుతారు. అప్పుడు అందరి మొహాలు సంబరాల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. సంతోషం ఆకాశం అంచులకు మోసుకెళ్లడంతో ప్రత్యేక అనుభూతిని పొందుతారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసే ఈ పతంగులు ఎగరేయడం వెనక ఓ ఆరోగ్య రహస్యమూ ఉంది తెలుసా. జనవరిలో వచ్చే ఈ పండగ ముందు వరకూ అందరూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుంటారు. అందుకే తరచూ ఇన్ఫెక్షన్ల కలిగి జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు అందరూ ఆరుబయటకు తప్పక రావాల్సిందే. ఆ సంబరంలో మునిగిపోయిన ప్రతి ఒక్కరూ సూర్యకాంతి మీద పడుతున్నా లెక్కచేయరు. అందరికీ గాలిపటం ఎంత దూరం వెళింది అనే దానిపైనే ధ్యాసంతా ఉంటుంది. అందువల్ల సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి పుష్కలంగా శరీరానికి లభించి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. పక్కవాళ్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగరేయాలి అనే తపన కూడా లక్ష్యాలను సాధించాలనే కసిని మనలో పెంపొదిస్తుంది.


గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. మాంజా వల్ల చేతికి గాయం కాకుండా తొడుగులు ధరించాలి. మరీ ముఖ్యంగా నైలాన్, సింథటిక్‌తో తయారు చేసిన చైనా మాంజాలు అస్సలు వాడకండి. అవి పొరపాటున మెడకు చుట్టుకుంటే ప్రాణాలే పోతాయి.

2. గాలిపటాలు ఎగరేసేటప్పుడు చుట్టుపక్కల మనుషులు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారేమో గమనించుకుని జాగ్రత్తగా ఎగురవేయండి. ఎందుకంటే, కొన్నిసార్లు మాంజా వల్ల గాయమయ్యే ప్రమాదం ఉంది.

3. రోడ్లకు దగ్గరగా గాలిపటం ఎగరేయకండి. ఒక్కోసారి గాలిపటం వాహనాలకు అడ్డుపడి యాక్సిడెంట్లకు కారణం కావచ్చు.

4. విద్యుత్ తీగలకు, టెలిఫోన్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, టీవీ, రేడియో సిగ్నల్ ఏరియాలకు దూరంగానే పతంగులు ఎగురవేయాలి.


5. గుంపులు గుంపులుగా ఎయిర్‌పోర్ట్‌లకు సమీపంలో ఎగిరేయటం చాలా ప్రమాదం.

6. తుపాను వాతావరణంలో, ఈదురుగాలులు, ఎదురుగాలులు వీచేటప్పుడు గాలిపటాన్ని ఎగురవేయవద్దు.

7. కొన్ని సందర్భాల్లో గాలిపటం కిందపడినప్పుడు కుక్కలు లాక్కెళ్లిపోయే ప్రమాదముంది. కాబట్టి, సేఫ్ ప్లేస్ ఎంచుకోండి.

8. ఎక్కువ బరువున్న గాలిపటాలు పిల్లలకు ఇవ్వకండి.

Updated Date - Jan 11 , 2025 | 02:04 PM