Share News

Sankranti : సంక్రాంతికి.. గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:24 PM

సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. వీటితో పాటు గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. చిన్నా, పెద్దా తేడా మరిచిపోయి ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. అయితే ఇలా గాలిపటాలు ఎగురేసేందుకు కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?

Sankranti : సంక్రాంతికి.. గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..
Why Everyone Flying Kites During Sankranti

కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగువారికి అతిపెద్ద పండగ ఇదే. దీన్ని రైతుల పండగ అని కూడా అంటారు. ఎందుకంటే, ఈ సమయంలోనే రైతులు పండించిన కొత్త ధాన్యం ఇంటికొస్తుంది. తమకు సాగులో సాయపడిన ఆవులు, ఎడ్లను సిరులు కురిపించే లక్ష్మిదేవితో సమానంగా పూజిస్తారు అన్నదాతలు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగకు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక విశిష్టత ఉంది. భోగి రోజున సూర్యోదయానికి ముందే భోగిమంటలు, ఇంటి ముందు ముగ్గులు, పిల్లలకు భోగిపళ్లు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలతో గంగిరెద్దులు, కోడిపందేలు, ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం. సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. వీటితో పాటు గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. చిన్నా, పెద్దా తేడా మరిచిపోయి ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. అయితే ఇలా గాలిపటాలు ఎగురేసేందుకు కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?


జనవరిలో సూర్యుడు ధనూరాశిలో నుంచి మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది వసంత ఆగమనాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పండగను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు తెలుగువారు. భోగి, మకర సంక్రాంతి, కనుమగా విభజించి మూడు రోజులూ ప్రత్యేక వేడుకలు జరుపుకుంటారు. వీటిలో మకర సంక్రాంతిని ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అంకితం చేస్తూ వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు.ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి మనసులోనూ, ఇంట్లోనూ కొత్తదనాన్ని నింపుతుంది. ఈ సమయంలో ఎగిరేసే గాలిపటాలకూ ప్రత్యేకత ఉంది.


సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఇలా ఎందుకు చేస్తారంటే.. సాధారణంగా చలికాలంలో క్రిములు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఎండ పొడ తగలక జలుబు, జ్వరం వస్తుంటాయి. లేలేత సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే డి- విటమిన్ ఉత్పత్తి అయ్యి సహజంగానే బ్యాక్టీరియా నశిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.


అంతేగాక, మకర సంక్రాంతి రోజున సూర్యకాంతికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్మకం. ఈ రోజున శరీరం మీద సూర్య కిరణాలు పడితే అమృతం లాంటివని అంటారు. వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వసిస్తారు. అందుకే పతంగులు ఎగరేయాలని ఆచారం మొదలైందని అంటారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం ఉంది. మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురవేస్తారట. అలాగే ఉత్తరాయణ సమయంలో నీలాకాశంలో గాలిపటం ఎగరేయడం వలన మనసుకు హాయిగా ఉంటుందని కొందరు చెబుతారు.

Updated Date - Jan 11 , 2025 | 04:27 PM