Rohit vs Gambhir: గంభీర్‌కు ఎందుకంత భయం.. రోహిత్ ఏం తప్పు చేశాడని..
ABN , Publish Date - Jan 03 , 2025 | 08:09 PM
Rohit Sharma: ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఇది క్రీడలకూ వర్తిస్తుంది. జట్టులో కొత్త రక్తం రావడం, పాత రక్తం బయటకు వెళ్లిపోవడం కామనే. అయితే ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. అంతేగానీ ఎన్నో సేవలు అందించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పంపించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
IND vs AUS: ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఇది క్రీడలకూ వర్తిస్తుంది. జట్టులో కొత్త రక్తం రావడం, పాత రక్తం బయటకు వెళ్లిపోవడం కామనే. అయితే ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. అంతేగానీ ఎన్నో సేవలు అందించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పంపించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎంత కాలం ఆడారు? టీమ్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? అనేవి పట్టించుకోకుండా అవమానించడం సరైనది అనిపించుకోదు. ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్ గురించి ఇవే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత భారత జట్టును తన సొంత చేతులతో తయారు చేసి.. మూడు ఫార్మాట్లలో టాప్‌లో నిలిపి, వరల్డ్ కప్ కూడా అందించిన కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్ అండ్ కో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
ఎందుకీ అవమానం?
గత కొన్ని నెలలుగా టెస్టుల్లో రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయాడనేది పూర్తిగా వాస్తవం. ఫామ్‌లో లేకపోవడంతో కెప్టెన్సీలోనూ అతడు తడబడుతున్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, అటాకింగ్ కెప్టెన్సీ చేయకపోవడంతో జట్టు కూడా పరాభవాల బాటలో పయనిస్తోంది. దీంతో అతడ్ని టీమ్ నుంచి తొలగించాలని హెడ్ కోచ్ గంభీర్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ భావించడంలో తప్పు లేదు. కొన్ని మ్యాచులు రెస్ట్ ఇచ్చి మళ్లీ జోష్‌లోకి వచ్చాక అతడ్ని తీసుకొస్తే బాగుండేది. కానీ హిట్‌మ్యాన్‌ను పూర్తిగా టీమ్‌కు దూరం చేయాలనుకోవడం, రిటైర్మెంట్ దిశగా నడిపించడం, టెస్టులకే కాదు.. వన్డేలకూ ప్రత్యామ్నాయ సారథిని వెతకడం లాంటివి లేనిపోని అపోహలు, అనుమానాలు, అనవసర విమర్శలు, వివాదానికి దారితీస్తున్నాయి.
కావాలనే తప్పించారా?
సిడ్నీ టెస్ట్‌లో రోహిత్‌ను జట్టులోకి తీసుకోలేదు. అయితే ఆ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా కన్వే చేయలేదు. హిట్‌మ్యాన్ తనంతట తానే జట్టు నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ బుమ్రాతో చెప్పించింది. ఆస్ట్రేలియా లాంటి బడా టీమ్‌తో సిరీస్. అందునా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. సిరీస్ డిసైడర్ ఫైట్. అలాంటి మ్యాచ్‌కు ఏ కెప్టెన్ అయినా పక్కకు జరగాలని అనుకుంటాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్‌ను మేనేజ్‌మెంట్ బలవంతంగా తప్పించిందని.. కానీ ఆ విషయాన్ని ఒప్పుకునేంత ధైర్యం కోచ్ గంభీర్‌కు లేదని కామెంట్స్ వస్తున్నాయి. హిట్‌మ్యాన్ ఏం తప్పు చేశాడని తీసేశారని.. కెరీర్ ఎండింగ్‌లో అతడితో వ్యవహరించే తీరు ఇదేనా? అని విమర్శలు వస్తున్నాయి. రోహిత్ అంటే గౌతీకి అంత భయం, ఇన్‌సెక్యూరిటీ ఎందుకు? అని సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలదీస్తున్నారు.