Himanshu Sangwan: కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్.. ఎవరీ హిమాన్షు సాంగ్వాన్
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:00 PM
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయాలనేది చాలా మంది బౌలర్ల డ్రీమ్. ఆ కలను నెరవేర్చుకున్నాడో అనామక ఆటగాడు. కళ్లుచెదిరే బంతితో కింగ్‌ను బోల్తా కొట్టించాడు. అతడే హిమాన్షు సాంగ్వాన్.

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే భీకర బౌలర్లు కూడా భయపడతారు. అతడు బరిలోకి దిగుతున్నాడంటే తోపు బౌలర్లకు కూడా వెన్నులో వణుకు పుడుతోంది. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే అరివీర భయంకరులు కూడా జడుసుకుంటారు. ఎక్కడ తమను ఊచకోత కోస్తాడోననేది వాళ్ల భయానికి కారణం. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను ముగించే విరాట్‌తో పెట్టుకోవడానికి స్టార్ బౌలర్లు కూడా వెనుకంజ వేస్తారు. అతడ్ని ఒక్కసారి ఔట్ చేసినా చాలని భావిస్తారు. అలాంటి కింగ్‌ను ఓ బచ్చా బౌలర్ భయపెట్టాడు. టార్గెట్ చేసి మరీ ఔట్ చేశాడు. అతడే హిమాన్షు సాంగ్వాన్.
షాక్‌లో కోహ్లీ!
రంజీ ట్రోఫీ-2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు కోహ్లీ. గురువారం మొత్తం ఫీల్డింగ్ చేసిన విరాట్.. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగాడు. ఆరంభంలోనే ఒక ఫోర్ కొట్టి అభిమానులతో కేరింతలు కొట్టించాడు. అతడు మంచి టచ్‌లో కనిపించడంతో సెంచరీ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డబుల్ డిజిట్ కూడా అందుకోకుండానే పెవిలియన్ చేరాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సాంగ్వాన్ కళ్లుచెదిరే ఇన్‌స్వింగర్‌తో కోహ్లీని బోల్తా కొట్టించాడు. సాంగ్వాన్ వేసిన బంతి విరాట్ బ్యాట్‌ను దాటి లోపలకు దూసుకెళ్లింది. అది తాకిన వేగానికి ఆఫ్ స్టంప్ ఎగిరి చాలా దూరంలో పడింది. క్లీన్‌బౌల్డ్ అవడంతో విరాట్‌కు ఏం జరిగిందో అర్థం కాక కొద్దిసేపు షాక్‌లో ఉండిపోయాడు.
టికెట్ కలెక్టర్!
ఎన్నో వేల పరుగులు, రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీని స్టన్నింగ్ డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు హిమాన్షు సాంగ్వాన్. దీంతో సోషల్ మీడియాలో ఇతడి పేరు మార్మోగుతోంది. ఎవరీ హిమాన్షు అని అంతా తెలుసుకునే పనిలో పడ్డారు. రైల్వేస్ తరఫున ఆడుతున్న ఈ పేసర్ పుట్టి పెరిగింది ఢిల్లీలోని నజఫ్‌గఢ్. 29 ఏళ్ల హిమాన్షు రైల్వేస్ కంటే ముందు ఢిల్లీకి ఆడాడు. అండర్-19లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 23 మ్యాచుల్లో 77 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏలో 17 మ్యాచుల్లో 21 వికెట్లు, టీ20ల్లో 7 మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 2019, సెప్టెంబర్ 27న అతడు అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది విజయ్ హజారేతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఆడాడు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం అతడు విధులు నిర్వహించాడని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
గిరిపడిన ఆఫ్ స్టంప్.. కోహ్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి
‘అమ్మాయిల ఫుట్‌బాల్.. సంప్రదాయాలకు వ్యతిరేకం’
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి