Share News

Yashasvi Jaiswal: పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

ABN , Publish Date - Jan 22 , 2025 | 06:36 PM

ICC Rankings: టీమిండియా సీనియర్ల ప్రదర్శన రోజురోజుకీ తగ్గిపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతోంది. దీంతో ఓటములతో పాటు జట్టుకు అవమానాలు తప్పడం లేదు. ఈ తరుణంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమ్ పరువు పోకుండా కాపాడాడు.

Yashasvi Jaiswal: పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
Yashasvi Jaiswal

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. టీమిండియాకు మూలస్తంభాలుగా ఉన్న ఇద్దరు టాప్ ప్లేయర్లు. అందులో ఒకరు ప్రస్తుత కెప్టెన్, మరొకరు మాజీ సారథి. ఇద్దరూ అన్ని ఫార్మాట్లలోనూ బ్యాట్‌తో అదరగొడుతూ భారత జట్టు ఈ రేంజ్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఇద్దరు స్టార్లు.. వన్డేలు, టెస్టుల్లో అంతగా రాణించడం లేదు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్‌లో అట్టర్‌ఫ్లాప్ అవుతున్నారు. దీని వల్ల టీమిండియాకు వరుస ఓటములు తప్పడం లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హవా చూపించే భారత్‌కు అక్కడా అవమానాలు తప్పడం లేదు. అయితే యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మాత్రం జట్టు పరువు పోకుండా కాపాడుతున్నాడు.


మనోళ్లు ఇద్దరే!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు. తాజాగా ప్రకటించిన మెన్స్ టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో అతడు 847 రేటింగ్ పాయింట్స్‌తో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895 పాయింట్లు) టాప్‌లో నిలవగా.. అదే జట్టు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (876), న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (867) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న ఏకైక భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (739 పాయింట్లు) 10వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా టాప్-20 ర్యాంకింగ్స్‌లో మరో భారత ఆటగాడు లేకపోవడం గమనార్హం.


బౌలింగ్‌లోనూ ఇద్దరే!

టెస్ట్ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్, పంత్ భారత్ పరువు కాపాడితే.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మన జెండా రెపరెపలాడేలా చేశాడు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడు 908 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (841), సౌతాఫ్రికా ఏస్ పేసర్ కగిసో రబాడ (837) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (745) ఈ లిస్ట్‌లో 10 స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి బుమ్రా, జడేజా మాత్రమే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో ఉండటం గమనార్హం.


ఇవీ చదవండి:

స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా ప్లాన్ ప్రకారమే

భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

మా జెర్సీలపై పాక్‌ పేరు వద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 06:47 PM