Shreyas Iyer: అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్.. కసితీరా కొట్టాడు
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:07 PM
Vijay Hazare Trophy: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే నాక్‌తో అలరించాడు. తన బ్యాటర్ పవర్ ఏమాత్రం తగ్గలేదని తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రూవ్ చేశాడు. ఒక్కో బౌలర్‌ను లెక్కబెట్టి కసితీరా కొట్టాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే నాక్‌తో అలరించాడు. తన బ్యాటర్ పవర్ ఏమాత్రం తగ్గలేదని తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రూవ్ చేశాడు. ఒక్కో బౌలర్‌ను లెక్కబెట్టి కసితీరా కొట్టాడు. మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ శతకంతో చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులు కొడుతూ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. అతడికి బౌలింగ్ చేయాలంటేనే అపోజిషన్ టీమ్ బౌలర్లు భయపడ్డారు. బంతి ఎక్కడ వేసినా, ఎలా వేసినా బౌండరీ లైన్‌కు తరలిస్తుండటంతో ఎలా ఆపాలో తెలియక తల మీద చేతులు పెట్టుకున్నారు.
ఫోర్ల వరద!
పుదుచ్చేరితో మ్యాచ్‌లో మొత్తంగా 133 బంతుల్లో 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు అయ్యర్. 15వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చినోడు ఆఖరి బంతి వరకు నిలబడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 బౌండరీలు బాదిన స్టైలిష్ బ్యాటర్.. 4 భారీ సిక్సులు కొట్టాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే దాదాపు 90 పరుగుల వరకు రాబట్టుకున్నాడు. దీన్ని బట్టే అతడు ఏ రేంజ్‌లో ప్రత్యర్థిపై అటాక్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఫోర్లు, సిక్సులు కొట్టినా.. అడ్డగోలుగా ఆడలేదు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే.. బాల్ మెరిట్‌ను బట్టి బ్యాట్ ఝళిపించాడు.
సూర్య ఫెయిల్!
అయ్యర్‌తో పాటు ముంబై బ్యాటర్లలో సిద్ధేష్ లాడ్ (34), అథర్వ అంకోల్కర్ (43) రాణించారు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన పుదుచ్చేరి.. 27.2 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. ఆకాశ్ ఆనంద్ సురేంద్ర ఖర్గవే (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. సూర్యాన్ష్ షెడ్గే, ఆయుష్ మాత్రే చెరో 2 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. కాగా, ముంబై బ్యాటింగ్‌లో స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటై క్రీజును వీడాడు.