Virat Kohli: జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్‌కు జస్ట్ ఎగ్జాంపుల్
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:08 PM
Delhi vs Railways: భారత క్రికెట్‌లో సూపర్ స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మరోమారు రుజువైంది. అభినవ క్రికెట్ దేవుడ్ని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పులకించిపోతారు. దేశాలకు సంబంధం లేకుండా అతడి బ్యాటింగ్ టాలెంట్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. అతడు బ్యాట్‌తో చేసే విన్యాసాలను చూసి ఫిదా అయిపోయారు. అతడి యాటిట్యూడ్‌కు కూడా ఎంతో మంది అభిమానగణం ఉన్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో కోహ్లీ ఆడుతున్నా చూసేందుకు వేలాదిగా జనాలు స్టేడియాలకు కదులుతారు. అలాంటిది సొంత గడ్డపై అదీ 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్నాడంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే జరిగింది. జనమా? బంతిపూల వనమా? అనే స్థాయిలో అభివన క్రికెట్ దేవుడ్ని చూసేందుకు మైదానానికి అశేష స్థాయిలో తరలివచ్చారు ప్రేక్షకులు.
వేలాదిగా క్యూ!
రంజీ ట్రోఫీ-2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు కోహ్లీ. అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడుతున్నాడని తెలిసి అభిమానులు వేలాదిగా స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ ఆరంభానికి ముందే గేట్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. స్కూల్ పిల్లల నుంచి యువకులు, పెద్దల వరకు అందరూ ఎప్పుడెప్పుడు విరాట్‌ను చూద్దామనే కుతూహలంతో వచ్చారు. ఉచిత టికెట్లు ఇవ్వడంతో పనులు మానుకొని మరీ కోహ్లీ ఆట చూసేందుకు స్టేడియం ముందు క్యూ కట్టారు. దాదాపు 2 కిలో మీటర్ల మేర ఉన్న లైన్ చూసి అంతా షాక్ అయ్యారు.
పారామిలటరీ పహారా!
కోహ్లీ మ్యాచ్‌కు సుమారుగా 16 వేల మంది వరకు జనం హాజరైనట్లు తెలుస్తోంది. రద్దీని కంట్రోల్ చేయడంలో స్టేడియం నిర్వాహకులు తడబడటంతో పారామిలటరీ బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. బలగాలు స్టేడియం లోపల తిరుగుతున్న ఫొటోలు, పిల్లలు గేట్ల ముందు క్యూ కట్టిన వీడియోలు, కదిలొచ్చిన అభిమాన సంద్రంతో అరుణ్ జైట్లీ స్టేడియం బంతిపూల వనాన్ని తలపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. కోహ్లీ మాస్ క్రేజ్‌కు ఇది జస్ట్ మచ్చుతునక అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఉంది. బహుశా విరాట్ రేపు బ్యాటింగ్ చేస్తాడేమో చూడాలి.
ఇదీ చదవండి:
అర్జున్ పాయింట్ పంచుకున్నాడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి